పట్టణాలకు పచ్చదనం అందాలు.. 

12 Nov, 2023 05:05 IST|Sakshi

ఎకో టూరిజం ప్రాజెక్టు కింద త్వరలో 100 నగర వనాలు ఏర్పాటు 

ఇప్పటికే 11 చోట్ల సిద్ధం, డిసెంబర్‌ నాటికి మరో 30 రెడీ  

మార్చికల్లా మిగిలిన వాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

ప్రజల అభిరుచులకు అను­గుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్‌చెరువు (రాజమ­హేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూ­లు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్‌లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.  

ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు 
కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్‌ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి.

కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్‌లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్‌ క్లబ్‌లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా..  
పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్‌ ట్రాక్, యోగా, వెల్‌నెస్‌ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.  

ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు 
ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం.    – ఎన్‌ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ 

మరిన్ని వార్తలు