త్వరలో మరి కొన్ని యార్డులలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు

29 Jan, 2015 02:22 IST|Sakshi

జేడీఏ రామాంజినేయులు
 
ఆదోని: మార్కెట్‌లో పత్తి దర తగ్గిపోవడంతో రైతులను అదుకునేందుకు మార్కెటింగ్ కడప రీజియన్ పరిధిలో మరి కొన్ని యార్డులలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని జేడీఏ రామాంజినేయులు తెలిపారు. బుధవారం ఆయన ఆదోని యార్డును పరిశీలించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ-టెండర్ల అమలు, అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారంపై యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి రామారావు, అధికారులతో చర్చించారు. సెస్సు వసూలును సమీక్షించారు. నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు.

అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్‌లో పత్తి ధర తగ్గిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారు. మద్దతు ధర క్వింటాలు రూ.4050 అమ్ముకోడానికి సీసీఐ వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కడప రీజన్‌లో సీసీఐ దాదాపు రూ.4.5 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే రైతుల నుంచి మరింత ఒత్తిడి పెరుగడంతో మరి కొన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమని తాము ప్రతి పాదనలు పంపగా ఇందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.

జిల్లాలో ఆలూరు, పత్తికొండ, డోన్, కడప జిల్లాలో గుత్తిలో కొత్తగా కేంద్రాలు ప్రారంబిస్తున్నామని తెలిపారు. సీసీఐ అధికారులు ఇందుకు అవసరం అయిన చర్యలు తీసుకుంటారని అన్నారు. వారంలోగా అన్ని అదనపు కేంద్రాలు ప్రారంభం అవుతాయని ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఆదోని యార్డులో విస్తరణకు అనుగుణంగా సెక్యూరిటీని పెంచకపోవడం వల్ల దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ నియామకంపై నిషేదం ఉందని పేర్కొన్నారు.

అయితే యార్డులో దాదాపు రూ.50 లక్షలతో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, నిర్వహణను ప్రేవేటు వ్యక్తులకు ఇస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని ఆయన వివరించారు. కాటన్ యార్డులో ప్లాట్ ఫారం పై కప్పు నిర్మాణం నెలల తరబడి ఎందుకు వాయిదా పడుతోందని ప్రశ్నించగా నైపుణ్యత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్లతో పాల్గొనడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఆరు సార్లు టెండర్లు పిలిచినా ప్రయోజన ం లేకుండా పోయిందని, మళ్లీ టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు.

రిజయన్‌లో మొత్తం 10 మార్కెట్ యార్డులకు ప్రభుత్వం పాలక మండళ్లను నియమించిందని, మిగిలిన యార్డులకు త్వరలోనే పాలక మండళ్లు నియమించే అవకాశం ఉందని తెలిపారు. పిడబ్ల్యూడీఆర్ స్వీం కింద రీజియన్‌లో రూ.2 కోట్లతో గోదాముల మరతమ్మతు చేపడుతున్నామని అన్నారు. కడప రీజియన్‌లో మొత్తం 60 మార్కెట్ యార్డులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.78.34 కోట్లు సెస్సు వసూలు చేయాలని లక్షంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 78 శాతం రూ.57.8 కోట్లు వసూలు చేశామని తెలిపారు. మిగిలిన మొత్తంను మార్చిలోగా వసూలు చేయాలని యార్డు అధికారులను ఆదేశించామని చెప్పారు.

మరిన్ని వార్తలు