ధరల మోత

11 May, 2015 01:48 IST|Sakshi
ధరల మోత

ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు  కందిపప్పు కిలోపై రూ. 20-30లు పెంపు
మినప్పప్పు ధర ఏకంగా రూ.130  బావురుమంటున్న బడుగుజీవి

 
మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. నిన్న మొన్నటి వరకు తక్కువగా ఉన్న ధరలు ఒక్కసారిగా చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్ ధరలు, మరో వైపు రెండు రాష్ట్రాల్లోని ఎంట్రీ ట్యాక్స్, ఇంకో వైపు వ్యాట్ పన్ను వెరసి సరుకుల ధరలు వినియోగదారుని వీపు విమానం మోత మోగిస్తున్నాయి. సాధారణ జనం ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని ఆందోళన చెందుతున్నారు.
 
కడప అగ్రికల్చర్ : సాధారణంగా ప్రతి ఇంట్లో కందిపప్పు, మినపప్పు, శనగ, వేరుశనగ పప్పులు, పప్పులు తప్పక వినియోగిస్తారు. వారం క్రితం మినపప్పు(ఉద్దిపప్పు) కిలో రూ. 80 ఉండగా నేడు అది రూ. 130కి చేరింది. అలాగే కందిపప్పు రకాలు కిలో రూ. 80-100 ఉండగా ఇప్పుడు రూ. 100-120 ధర పలుకుతున్నాయి. వేరుశనగ పప్పు కిలో రూ. 56లు ఉండగా నేడు రూ. 80, శనగ బేడలు కిలో రూ.45 ఉండగా ఇప్పుడు వాటి ధర కిలో రూ. 60 పలుకుతున్నాయి.

పప్పులు కిలో రూ. 45 ఉండగా ఇప్పుడు కిలో రూ. 60ల ధర ఉంటోంది. ఎండు మిరపకాయలు కిలో రూ. 80 ఉండేవి, ఇప్పుడు కాస్త కిలో రూ.110కి చేరింది. తెల్లగడ్డలు కిలో రూ.40 నుంచి రూ. 60, చింతపండు కిలో రూ. 55 నుంచి రూ. 78లకు చేరుకుంది. ధరలు ఇలా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

 ఇదేనా చంద్రబాబు పాలన
 ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని రకాల నిత్యావసర ధరలు అదుపులో ఉంటాయని ఎన్నికల సందర్భంలో ప్రచారంతో హోరెత్తించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని రకాల పన్నులు విధించి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. అప్పట్లో 9 రకాల నిత్యావసర వస్తువులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ప్రజలకు సబ్సిడీపై అందించేది.

దాని వల్ల ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ. 170ల వరకు భారం తగ్గేది.  కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తగ్గడం మాట అటుంచి మార్కెట్లో ఉన్న ధరల్లో కూడా ఒక్కో సరుకు ధర రూ. 120-130ల వరకు పెరిగాయి. ప్రస్తుతం వినియోగదారునిపై భారం అమాంతంగా పడుతోంది.

మరిన్ని వార్తలు