పోలీసులు ప్రజల్లో భాగమే

19 Oct, 2019 09:13 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌ 

సాక్షి, చిత్తూరు అర్బన్‌: పోలీసులు కూడా ప్రజల్లో భాగమేనని, స్టేషన్‌కు రావాలంటే ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో పోలీసు శాఖ పనితీరు, ప్రజల అభిప్రాయాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులపై ప్రజల్లో ఉన్న దురాభిప్రాయాన్ని తొలగించి, లోటుపాట్లను చర్చించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయన్నారు. ప్రజలు కూడా యూనిఫాం ధరించని బాధ్యత కలిగిన పోలీసులేనన్నారు. ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ ప్రజలు పోలీసు శాఖపై అభిప్రాయాలు పంచుకోవాలన్నా, ఆపదలో ఉన్నప్పుడు డయల్‌–100, పోలీసు వాట్సప్‌–9440900006 లకు ఫోన్‌ చేయాలన్నారు.

నగరానికి చెందిన సీ–ప్యాక్‌ సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో అవినీతిని తగ్గించడానికి ప్రయత్నించాలని, ఫ్రెండ్లీ పోలీస్‌ను మరింత కిందిస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలు స్టేషన్‌కు ధైర్యంగా రావాలంటే స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. జైన్‌సంఘ నిర్వాహకులు సుభాష్‌జైన్‌ మాట్లాడుతూ పోలీసులతో పాటు ప్రజలు కూడా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్‌ఫర్‌ బెటర్‌ సంస్థ ప్రతినిధి విష్ణు, సీతమ్స్‌ కళాశాల అధ్యాపకులు షపీ, ఏఎస్పీలు కృష్ణార్జునరావు, చంద్రమౌళి, సీఐలు భాస్కర్‌రెడ్డి, యుగంధర్‌ పాల్గొన్నారు.

516 మంది రక్తదానం
పోలీసు అమరవీరుల వారోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 516 మంది రక్తదానం చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు సంక్షేమ ఆస్పత్రిలో 152 మంది రక్తదానం చేయగా పరిశీలించి, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు