రాష్ట్రంలో ప్రత్యేక పోలీస్‌ శిక్షణ కేంద్రం

19 Feb, 2020 05:13 IST|Sakshi
ఏపీపీ పోస్టుల ఫలితాలు విడుదల చేస్తున్న హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు

కేంద్ర అనుమతి రాగానే ఏర్పాటు 

రాష్ట్ర హోం మంత్రి  సుచరిత 

ఏపీపీ పరీక్షా ఫలితాలు విడుదల  

సాక్షి, అమరావతి:  రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమల్లో భాగంగా ఏపీలో ప్రత్యేక పోలీస్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) భర్తీ పరీక్షా ఫలితాలను హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్, డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌) చైర్మన్‌ అమిత్‌ గార్గ్‌తో కలిసి హోంమంత్రి మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో విడుదల చేశారు. పోలీస్‌ శిక్షణా సంస్థ ఏపీకి చాలా అవసరమనే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకెళ్లారని సుచరిత వెల్లడించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చే ప్రక్రియ ఆగలేదని పేర్కొన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశామని తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగులను వెయిటింగ్‌లో(వీఆర్‌) పెడుతున్నారని, జీతాలు ఇవ్వడం లేదంటూ కొన్ని మీడియా సంస్థలు, కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విమర్శించారు. అందరికీ పోస్టింగ్‌లిస్తున్నామని గుర్తు చేశారు.  

50 శాతానికి పైగా మహిళలే..  
రాష్ట్రంలో ప్రాసిక్యూషన్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 50 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను హోం మంత్రి విడుదల చేశారు. మొత్తం 50 పోస్టులకుగాను 49 మందిని ఎంపిక చేశారు. జోన్‌–4లో ఆర్థోపెడికల్లీ హ్యాండీకాప్డ్‌(మహిళ) కేటగిరీ కింద కేటాయించిన పోస్టుకు అర్హతలు గల అభ్యర్థి లేకపోవడంతో దానిని భర్తీ చేయలేదు. మొత్తం పోస్టుల్లో 50 శాతానికి మహిళలే ఎంపికవడం విశేషం. ఎం.లావణ్య 281.50 మార్కులు, సీహెచ్‌ చంద్రకిషోర్‌ 277.3 శాతం మార్కులు, తేజశేఖర్‌ 251 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.  
  

మరిన్ని వార్తలు