మనిషే మణిదీపం.. మనసే నవనీతం

3 May, 2020 04:09 IST|Sakshi

అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి

కరోనా వేళ మరింత పెరిగిన ఆప్యాయతలు..విపత్తు వేళ తమ వారి క్షేమం కోసమే తపన

లాక్‌ డౌన్‌తో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం..కరోనా బారిన పడకుండా బంధుమిత్రులంతా బాగుండాలని కోరుకుంటున్న జనం

మహమ్మారి దెబ్బతో మారిన జీవన చిత్రం 

‘రేయ్‌.. పెద్దోడా!.. ఆ ఉద్యోగం సంగతి వదిలేసి పిల్లల్ని, కోడల్ని తీసుకుని ఏదోరకంగా మన ఊరికొచ్చెయ్‌’ విజయవాడలోని తన కొడుక్కి పల్లెటూరి తల్లి రోజూ ఫోన్‌ చేస్తూ ప్రేమతో కూడిన సతాయింపు.

‘అమ్మా.. హారికా!.. నువ్‌ డాక్టర్‌ కావాలని అప్పులు చేసి మరీ పరాయి దేశం పంపించాం. ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల నువ్వు రాలేవ్‌. మేం వద్దామన్నా ఇక్కడా లాక్‌డౌన్‌. ప్రతి రోజూ నువ్వెలా ఉన్నావో అని ఆందోళనగా ఉంటోందమ్మా’ ఇది ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ చేస్తున్న కుమార్తెకు ఓ తండ్రి వీడియో కాల్‌ చేసి ఆప్యాయతతో కూడిన నిట్టూర్పు. ‘నాన్నతో మాట్లాడదామంటే వీలయ్యేది కాదు. కరోనా వల్ల ఇప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే మాతోనే గడుపుతున్నారు’ పల్లె, పట్నమనే తేడా లేకుండా చాలా కుటుంబాల్లో పిల్లలు తల్లితో అంటున్న అనురాగపు మాటలు.

కరోనా మహమ్మారి దెబ్బతో జీవన చిత్రమే మారిపోయింది. ప్రతి ఇల్లూ ఇప్పుడు ఆప్యాయతల లోగిలైంది. అనురాగాలకు వేదికైంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.  

సాక్షి, అమరావతి: పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరి పనుల్లో వారు నిత్యం బిజీగా గడిపేసేవారు. లాక్‌డౌన్‌ పుణ్యమా అని అందరూ ఆప్యాయత, అనురాగాల గొడుగు కిందకు చేరుకున్నారు. విపత్తు వేళ అయిన వారి క్షేమం కోసం తపన పడుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో సగటు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కాలపు జీవన విధానం తిరిగి ఊపిరి పోసుకుంటోంది. అందరిలోనూ ఆప్యాయతానురాగాల్ని తట్టి లేపుతోంది. 

కలిసొచ్చిన వర్క్‌ ఫ్రం హోం 
సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు, వ్యాపారులు పగటి వేళ విధి నిర్వహణలో నిమగ్నమయ్యే వారు. కుటుంబ సభ్యులతో రోజుకు సగటున 50 నిమిషాల నుంచి రెండున్నర గంటలే గడిపేవారు. కోవిడ్‌–19తో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతోపాటు అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వెసులుబాటు కల్పించాయి. ఫలితంగా రోజుకు సగటున 6 నుంచి 9 గంటలపాటు ఇళ్లల్లో భార్యా పిల్లలకు టైమ్‌ కేటాయిస్తున్నారు.  

 పిల్లల లోకం మారింది 
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులిచ్చింది. దీంతో పుస్తకాలే ప్రపంచంగా కుస్తీ పట్టిన పిల్లలకు ఆటవిడుపు చిక్కింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లన్నీ సందడిగా మారాయి. చాలా మంది పిల్లలు మొబైల్, వీడియో గేమ్స్, చెస్, క్యారమ్స్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులకు పనుల్లో సాయం చేస్తున్నారు. 

ఎడతెగని ఉత్కంఠ 
అంతర్జాతీయంగానూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. పొరుగు దేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారి కోసం ఇక్కడి వారిలో ఉత్కంఠ నెలకొంది. దేశం కాని దేశంలో తమ పిల్లలు ఎలా ఉన్నారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వీడియో, ఫోన్‌ కాల్‌లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. 

అందరూ బాగుండాలి 
పల్లెటూళ్లలో తల్లిదండ్రులు ఎలా ఉన్నారోనని పట్నంలోని పిల్లలు, తమ బిడ్డల గురించి కన్నవారు నిత్యం ఫోన్‌లో ఆప్యాయ పలకరింపులు పెరిగాయి. తోబుట్టువులు, బంధుమిత్రులకు కాల్‌ చేసి వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారు క్షేమంగా ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. మొత్తానికి కరోనా దెబ్బకు జీవన చిత్రం మారింది.   

మరిన్ని వార్తలు