-

మంత్రుల్లో చీలిక, రాజీనామాలకు ముందుకొచ్చింది ముగ్గురే!

2 Aug, 2013 02:43 IST|Sakshi
మంత్రుల్లో చీలిక, రాజీనామాలకు ముందుకొచ్చింది ముగ్గురే!
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసే విషయంలో సీమాంధ్ర మంత్రులు రెండుగా చీలిపోయారు. ముగ్గురు మంత్రులే రాజీనామాలు సమర్పించగా, మిగతా వారు వెనుకడుగు వేశారు. అధిష్టానం పెద్దల ఆదేశానుసారం పార్టీ నిర్ణయానికి కట్టుబడాలనే అభిప్రాయానికి ఆ మంత్రులు వస్తున్నారు. గురువారం మంత్రుల క్వార్టర్లలో రెండు గంటలు, తర్వాత క్యాంపు కార్యాలయంలో కిరణ్‌తో దాదాపు నాలుగు గంటలు మంత్రులు భేటీ అయ్యారు. అదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియా వారిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నందున ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు తప్పవని మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, ైశె లజానాథ్, కాసు కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారని తెలిసింది. రాజీనామాలకే నిర్ణయించుకున్నామని గంటా, ఏరాసు, టీజీ తమతో తెచ్చిన రాజీనామా పత్రాలను కిరణ్‌కు అందించారు. కాసు, అహ్మదుల్లా, మహీధర్‌రెడ్డి కూడా రాజీనామా లేఖలు ఇచ్చినట్టు చెబుతున్నా నేతలు ధ్రువీకరించలేదు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతలు రాజీనామాల ప్రభావం తమపై చాలా ఎక్కువగా ఉంటుందని మంత్రులు చెప్పారు. పదవుల్లో ఉండడం వల్ల ప్రజల్లోకి వెళ్లలేమని, వారి నుంచి తీవ్ర ప్రతిఘటనను తప్పదని వారన్నట్టు సమాచారం. ‘అసెంబ్లీలో తీర్మానంపై చర్చలో మీ అభిప్రాయాలన్నీ క్షుణ్నంగా చెప్పుకోవచ్చు. వాటిని కేంద్రం పరిశీలిస్తుంది’ అని అధిష్టానం దూతలన్నారు. విభజనకు వ్యతిరేకత తెలుపుతూ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని మంత్రులనగా, ‘అసెంబ్లీ వ్యతిరేకించినా, ఆమోదించినా పట్టించుకునే అవసరం కేంద్రానికి లేదు. అక్కడి చర్యలు ఆగేది లేదు. ఈ సమయంలో ప్రభుత్వానికి, పార్టీకి సహకరించాల్సిందే’నని దూతలు నిక్కచ్చిగా చెప్పారు. విభజన వల్ల తమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని, తమ ప్రయోజనాల గురించి ఏమీ తేల్చకుండానే ఎలా ప్రకటన చేస్తారని టీజీ, ఏరాసు అడిగినా, విభజన ఎవరికీ ఆమోదయోగ్యం కాదని గంటా తదితరులు అన్నా, ‘సమస్యలుంటే కేంద్ర మంత్రుల బృందానికి చెప్పుకోండి’ అంటూ సరిపెట్టారు. శనివారం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో సమావేశమై నచ్చచెబుతామని, అప్పటిదాకా ఓపిక పట్టాలని దూతలు సూచించారు. నాలుగైదు రోజుల్లో దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌కు వస్తారని చెప్పారు. భేటీ తర్వాత మంత్రులు, పీసీసీ చీఫ్ బొత్స సహా అంతా ఎవరికి వారు మీడియాతో వివరంగా మాట్లాడకుండా వెళ్లిపోయారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ వారితో చర్చలు చేపట్టారు.
 
 లేఖలు రాద్దామన్న కిరణ్: ఒక దశలో చర్చ తీవ్రస్థాయికి వెళ్లినప్పుడు మంత్రి ఆనం మాట్లాడుతూ, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా మీరే రాజీనామా చేయాలని కిరణ్‌కు చెప్పారు. అధిష్టానం నిర్ణయం ఇప్పటికే తీసుకుందని, జరగాల్సిందింకా ఉన్నందున లేఖ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. రాజీనామా చేయాల్సి వస్తే అసలు పార్టీలోనే ఉండనని బొత్స స్పందించారు. రాజీనామాలు ఇచ్చామని మీరు బయట చెప్పుకోండి, అవి నాకొచ్చాయని చెబుతానంటూ బొత్స ముక్తాయించినట్టు సమాచారం!
 రాజీనామాలపై రేపు నిర్ణయం.. శైలజానాథ్: మంత్రి పదవులకు రాజీనామాలతోపాటు భావి కార్యాచరణపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఎస్.శైలజానాథ్ చెప్పారు. కొద్దిమంది మంత్రులు రాజీనామా చేసినా వాటిని కిరణ్ పక్కన పెట్టారని చెప్పారు. సమైక్య రాష్ట్రాన్ని నెహ్రూ ఏర్పాటు చేస్తే ఇందిర, రాజీవ్ కాపాడారని, దాన్ని సోనియా విభజించడం తమకు బాధ కలిగించిందని అన్నారు. తానైతే రాజీనామా చేయలేదని మంత్రి పి.బాలరాజు చెప్పారు. చాలామంది మంత్రులు మీడియాతో మాట్లాడానికే ఇష్టపడలేదు.
మరిన్ని వార్తలు