శిష్యుడిపై గురువుదే విజయం

3 Jun, 2015 01:08 IST|Sakshi
శిష్యుడిపై గురువుదే విజయం

 ⇒ కాశీ మఠం మఠాధిపతి సుధీంద్ర తీర్థ స్వామే
 ⇒ ఆ స్థానాన్ని ఆయన పరిత్యజించలేదు
 ⇒ తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు
 ⇒ రాఘవేంద్ర తీర్థ స్వామి అప్పీళ్లు కొట్టివేత


 సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన మఠాల్లో ఒకటైన కాశీ మఠం, బెనారస్ మఠాధిపతి విషయంలో జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటంలో శిష్యుడిపై గురువు విజయం సాధించారు. కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా శ్రీమధ్ సుధీంద్ర తీర్థ స్వామే కొనసాగుతారని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. మఠాధిపతి స్థానాన్ని ఆయన పరిత్యజించలేదని తెలిపింది. తాను కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా నియమితులయ్యానంటూ సుధీంద్ర స్వామి శిష్యుడు శ్రీమధ్ రాఘవేంద్ర తీర్థ స్వామి చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని రుజువు చేసేందుకు రాఘవేంద్ర తీర్థ స్వామి ఎటువంటి ఆధారాలు చూపలేదని తేల్చిచెప్పింది.

ఇదేసమయంలో మఠాధిపతి స్థానాన్ని తాను పరిత్యజించలేదని సుధీంద్ర స్వామి రుజువు చేయగలిగారని తెలిపింది. ఇందుకు సంబంధించి కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాఘవేంద్ర తీర్థ స్వామి దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని, దీంతో ఆయన శిష్యుడిగా తాను మఠాధిపతినయ్యానంటూ రాఘవేంద్ర స్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మఠం వ్యవహారాల్లో సుధీంద్ర స్వామితోసహా ఇతరులెవ్వరినీ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ తిరుపతి కోర్టులో 2000 సంవత్సరంలో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు రాఘవేంద్రస్వామి పిటిషన్‌ను 2009లో కొట్టేసింది. దీనిపై ఆయన అదేఏడాది హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు.

మఠాచారాల ప్రకారం మఠాధిపతి మహాసమాధి అయ్యాకనే ఆయన వారసుడిని మఠాధిపతిగా నియమిస్తారని జస్టిస్ నాగార్జునరెడ్డి తన 34 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సుధీంద్ర స్వామి కేవలం పాలన వ్యవహారాలు, ఇతర దైవిక వ్యవహారాల బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని గుర్తుచేశారు. మఠాధిపతిగా కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించడానికీ, మఠాధిపతి స్థానాన్ని పరిత్యజించడానికీ తేడా ఉందన్నారు. కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించాక కూడా మఠపెద్దగా మఠాధిపతి స్థానంలో కొనసాగేందుకు సుధీంద్ర స్వామికి అధికారముందని తేల్చారు.
 
 ఎంతో ఘన చరిత్ర కలిగిన ఓ మఠానికి చెందిన మఠాధిపతి శిష్యుడు గద్దెకోసం తన గురువునే వివాదంలోకి లాగారు. కింది కోర్టులో చుక్కెదురైనా తను అనుకున్నది పొందేందుకు హైకోర్టును ఆశ్రయించారు. తన గురువుపైనే ఈ సన్యాసి చేస్తున్న న్యాయపోరాటాన్ని చూస్తుంటే, ఇటువంటి వ్యక్తులు కూడా సాధారణ వ్యక్తులవలే ఉన్నత స్థానాలకోసం వెంపర్లాడుతారా? అని ఆశ్చర్యం కలుగుతోంది.
 - జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి

మరిన్ని వార్తలు