నాన్న మంచితనమే గెలిపించింది

17 Sep, 2014 02:47 IST|Sakshi
నాన్న మంచితనమే గెలిపించింది

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్

దివంగత తంగిరాల ప్రభాకరరావు కుమార్తెకు పట్టం
74,827 ఓట్ల మెజారిటీ  కాంగ్రెస్‌కు దక్కిన డిపాజిట్
‘నోటా’కు మూడో స్థానం

 
నందిగామ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మంచితనం వల్లే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందానని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ నెల 13న నందిగామ(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌ను మంగళవారం స్థానిక కేవీఆర్ కళాశాలలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో 1,84,064 ఓట్లు ఉండగా, 1,27,434 ఓట్లు పోలయ్యాయి.
 
సౌమ్యకు 99,748 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన కటారపు పుల్లయ్యకు 941, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం సౌమ్య మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడం కూడా తన గెలుపునకు దోహదపడినట్లు ఆమె తెలిపారు.
 
తన గెలుపునకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలసి ర్యాలీగా స్థానిక రైతుపేటలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సౌమ్య మంత్రి ఉమాకు పాదాభివందనం చేశారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచారు. అక్కడి నుంచి తంగిరాల ప్రభాకరరావు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు టీడీపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు.
 
ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ
నందిగామ కేవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఉదయం 8 గంటలకు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ సిబ్బందికి అందజేశారు. ఎన్నికల రిటర్సింగ్ అధికారి రజనీకాంతరావు కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సస్పెండ్ చేయటంతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, అబ్జర్వర్ సాగర్‌ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరిగింది. కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చివరి 15వ రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, ఎన్నికల అబ్జర్వర్ సాగర్, తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
మాకు గెలుపు, ఓటములతో పనిలేదు : బోడపాటి
తమకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావు అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఎన్నికల్లో పోటీ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చిన తమ పార్టీకి ఉప ఎన్నికల్లో 24,921 ఓట్లు లభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, గింజుపల్లి అనిల్, జాఫర్ పాల్గొన్నారు.
 
డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. టీడీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 74,827 భారీ మెజారిటీ రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఊరట లభించింది.
 
మూడో స్థానంలో ‘నోటా’
నందిగామ ఉప ఎన్నికల్లో మూడో స్థానం ‘నోటా’కు లభించింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కటారపు పుల్లయ్యకు 941 ఓట్లు, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. కానీ, నోటా గుర్తును 1,177 మంది నొక్కారు. దీంతో మూడో స్థానం ‘నోటా’కు లభించినట్లయింది.

మరిన్ని వార్తలు