సొమ్ములు పోయినా సొంతగూడు దక్కలేదు

12 Jun, 2019 10:44 IST|Sakshi
వెంపలో మధ్యలో నిలిచిపోయిన ఇళ్లు

సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.  నిన్నటి వరకు అధికారపార్టీ నాయకుల ఆగడాలకు భయపడి వారంతా ముందుకు రాలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో  తమ బాధలను ఏకరువు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా పేదలకు ఇల్లు కట్టించకపోయినా ఆ పార్టీ నాయకులు ఇళ్ల పేరుతో పేదలను దోచుకున్నారు. దీనిలో భాగంగా భీమవరం మండలం వెంప గ్రామంలో కొత్తకాలనీ ఇళ్ళ నిర్మాణం పేరుతో ఆ ప్రాంత టీడీపీ నాయకులు పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి తమను నట్టేట ముంచారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్ళుగా ఇళ్ళ నిర్మాణం నిలిచిపోవడంతో 56 కుటుంబాలకు నిలువనీడ లేక రోడ్డున పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో మూడేళ్ళ క్రితం వెంప కొత్తకాలనీ ప్రభుత్వ భూమిని ఇళ్లస్థలాలుగా 56 మంది లబ్ధిదారులకు కేటాయించారు.

వీరందరికీ ఎన్టీఆర్‌ గృహ పథకంలో ఇళ్లను మంజూరు చేసినట్లు నాయకులు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం గృహ నిర్మాణానికి రూ.1.50 లక్షలు మాత్రమే  ఇస్తుందని ఆ సొమ్ములతో ఇళ్ల నిర్మాణం పూర్తికాదని కొంతమంది టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.లక్ష వసూలు చేశారు. దీంతో తమకు సొంత గూడు ఏర్పడుతుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. సొమ్ములు వసూలు చేసి మూడేళ్లు గడిచిపోయినా ప్రస్తుతం ఆ కాలనీలో కొన్ని ఇళ్లు పునాదుల్లో నిలిచిపోతే, మరికొన్ని శ్లాబ్‌ వేసి ఆగిపోయాయి. ఇళ్లు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో నివసించాల్సి వస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకపోవడంతో ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. ఎన్నికల కోడ్‌ కారణంగా నిర్మాణం నిలిచిపోయిందని డబ్బులు వసూలు చేసిన పెద్దలు చెబుతున్నారని, అయితే గత మూడేళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేవని వారు వాపోతున్నారు. 

మూడేళ్లుగా సాగని నిర్మాణాలు
మూడేళ్ల క్రితం ఇళ్లు మంజూరైనా ఇప్పటికీ  నిర్మాణం జరగడంలేదు. ఈ కాలనీలో నా కుమార్తె  కట్టా నాగవేణికి  ఇల్లు  మంజూరైంది. గృహ నిర్మాణానికి ముందుగా రూ.లక్ష ఇవ్వాలని చెప్పడంతో వడ్డీకీ తెచ్చి మరీ ఇచ్చాం. ఇప్పటి వరకు నా కుమార్తెకు పట్టా ఇవ్వలేదు సరికదా, అసలు ఇల్లు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.
- కొప్పిశెట్టి నాగ చంద్రరావు

శ్లాబ్‌ వేసి నిలిపేశారు
నాకు ఇల్లు మంజూరైందని చెప్పడంతో ఎంతో ఆనందించా. నిర్మాణం ప్రారంభం కాగానే సొంత ఇంటి కల సాకారమవుతుందని ఆశపడ్డా. అయితే ఇంటికి శ్లాబ్‌ వేసి చాలా కాలమైనా మిగిలిన పనులు ఆగిపోయాయి
- శింగారపు నాగమణి

పునాదులు కూడా వేయలేదు
ఇల్లు కట్టించి ఇస్తామని నా వద్ద రూ.లక్ష తీసుకున్నారు. కనీసం పునాదులు కూడా వేయలేదు. నా బిడ్డ వికలాంగుడు. ఎంతో పేదరికంలో ఉన్నా సొంత గూడు ఏర్పడుతుందని సొమ్ములు ఇచ్చా. ఇప్పడేమో ప్రభుత్వం మారిపోయింది. పాత ఇళ్లకు నిధులు మంజూరుకావని చెబుతున్నారు. 
- కాలా మాణిక్యం
 

మరిన్ని వార్తలు