కిషోర్‌ అనుచరుల బరితెగింపు

8 Mar, 2019 12:51 IST|Sakshi
పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కేటాయించిన ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి ఉన్న దృశ్యం

ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి విక్రయాలు

పట్టాల పంపిణీ ముసుగులో టీడీపీ నేతల దందా

తెలిసినా నోరు మెదపని అధికారులు

పేదల నివాసాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ‘పెద్దలు’ ఆక్రమించుకుంటున్నారు. పేదల పట్టాల పంపిణీ ముసుగులో ప్లాట్లు వేసి మరీ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.  ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు ఈ విక్రయాలు పూర్తిచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇప్పటి నుంచే భారీగా నగదును కూడబెడుతున్నారు.

సాక్షి, తిరుపతి:  ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం దగ్గరపడుతుండడంతో పీలేరులో టీడీపీ నేతలు ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి దర్జాగా అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభపెట్టేందుకు ఈ సొమ్మును విచ్చలవిడిగా వినియోగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరుల అవినీతి అక్రమాలపై ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనంతో కొద్ది రోజలు ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. అధికారుల అలసత్వంతో తాజాగా తిరిగి అక్రమాలకు తెరలేపారు. వారం రోజులుగా హడావుడిగా ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు. ఎర్రగుంట పల్లిలో సర్వే నంబర్‌ 562, 655/బి, 782/1, 783/2, 3, 786/3లో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని నివాసాలు లేని అర్హులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కేటాయించారు.  88 మందికి మాత్రమే పట్టాలిచ్చారు. ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున సుమారు 2.50 ఎకరాల భూమిలో పట్టాలిచ్చారు. మిగిలిన 13.50 ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.

అధికారులతో కలిసి స్వాహా?
 బోడుమల్లువారి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 906లోని 21.85 ఎకరాలను ఎన్టీఆర్‌ హౌసింగ్‌ కోసం కేటాయించారు. అదే విధంగా సర్వే నంబర్‌ 682/11, 652/10లో మొత్తం 12 ఎకరాలను టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కొందరు కలిసి విక్రయించి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పత్రికా విలేకరులకు కేటాయించిన 2.75 ఎకరాలను కూడా విక్రయించి స్వాహా చేశారు. మొత్తం 33.70 ఎకరాల్లో 581 మందికి మాత్రం పట్టాలిచ్చి మిగిలిన వాటిని అమ్మి జేబులు నింపుకుంటున్నారు.

అనుచరులకే పట్టాలు
పేదల పేరుతో ప్రభుత్వ భూములను కేటాయించుకుని టీడీపీ పెద్దలు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు ఇందిరమ్మ కాలనీ సర్వే నంబర్‌ 1045, 1076, 1079, 1131, 1140, 1146లో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాల కోసం కేటాయించారు. అదే విధంగా లక్ష్మయ్య అనే వ్యక్తికి ఇచ్చిన 3.86 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకుని టీడీపీ నాయకులు ప్లాట్లు వేసి విక్రయించడం ప్రారంభించారు. మొత్తంగా చూస్తే పీలేరు పట్టణ పరిధిలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పేరుతో 104 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. అందులో పట్టాలు పంపిణీ చేసింది 1530 మందికి మాత్రమే.  వీరందరికి కేటాయించిన భూమి కేవలం 40 ఎకరాలు మాత్రమే. మిగిలిన 64 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి అంకనం రూ.7వేల నుంచి రూ.25వేల చొప్పున యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ అమ్మకాలు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు పూర్తి చేయాలనే లక్ష్యంగా టీడీపీ నేతలు జోరు పెంచారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పంపిణీ చేసిన పట్టాల్లో ఎక్కువ శాతం టీడీపీ నేతలు బినామీ పేర్లతో కొన్ని, అనుచరులకు మరి కొన్ని కేటాయించుకున్నారు.

మరిన్ని వార్తలు