ఎమ్మెల్యేల పేరిట టిప్పర్ల దూకుడు

4 Feb, 2015 01:58 IST|Sakshi

బూర్జ : మండలంలోని కాఖండ్యాం ఇసుక ర్యాంపువద్ద ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరు చెప్పి కొంత మంది టిప్పరు డ్రైవర్లు దూసుకు పోతున్నారని లారీ డ్రైవర్లు మంగళవారం సాయంత్రం ఉవ్వపేట వద్ద ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పిన వారికే ఇక్కడ ఇసుక వెనువెంటనే లోడ్‌చేసి పంపిస్తున్నారని, రికమండేషన్ లేనివారికి 5 నుంచి వారం రోజులు వరకు వేచి ఉండా ల్సి వస్తోందని విశాఖ, విజయవాడ, పలాస, నరసన్నపేట వంటి దూరప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు గగ్గోలు పెట్టారు. ఇసుక ర్యాంపుల వద్ద స్థానికుల హవా కొనసాగుతోందని,
 
 ఈ ర్యాంపులో వారి ఇష్టానుసారంగా జరుగుతోందని, ఏ ఒక్క టిప్పరునూ విడిచి పెట్టేదిలేదని ఆగ్రహిస్తూ రోడ్డుపై లారీలను అడ్డంగా పెట్టారు. ఇక్కడ తినటానికి కూడా ఏమీ దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మమ్మ ల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు వాపోయారు. దీనిపై ఇసుక రీచ్ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మామిడి కమల వద్ద  ప్రస్తావించగా కొన్ని టిప్పర్లు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వస్తున్నాయని, ఏమీ అనలేక వారి టిప్పర్లు ముందుగా లోడ్‌చేసి పంపిస్తున్నమాట వాస్తవమేనని చెప్పారు. రెండు జేసీబీల వల్ల సకాలంలో ఇసుకను లోడ్ చేయలేకపోతున్నామని మరో జేసీబీ అవసరముంటుందని చెప్పారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులకు విన్నవించామని, బుధవారం నాటికి పంపిస్తామన్నారని ఆమె చెప్పారు. ఇక నుంచి జాప్యం జరగదని హామీ ఇవ్వటంతో లారీడ్రైవర్లు శాంతించారు.
 

మరిన్ని వార్తలు