టీడీపీ నాయకులపై కేసు నమోదు

19 Aug, 2019 09:46 IST|Sakshi
శుక్రవారం ఉండవల్లిలో పోలీసులపై చేయి చేసుకుంటున్న టీడీపీ కార్యకర్త

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): కృష్ణా కరకట్ట వెంబడి ఉండవల్లిలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకులపై తాడేపల్లి పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అదే రోజు అక్కడికి చేరుకొని వరద ఉధృతిని పరిశీలించారు. అయితే వరద నీరు రాకున్నా ఎమ్మెల్యే ఆర్కే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు దిగారు. డ్రోన్‌ కెమెరాతో చంద్రబాబు నివాసాన్ని వీడియో చిత్రీకరిస్తున్నారంటూ ధర్నాకు దిగారు.

వరద ఉధృతిని పరిశీలించడానికి అన్ని ప్రాంతాల్లో తామే డ్రోన్‌ వాడుతున్నామని ఇరిగేషన్‌ అధికారులు చెప్పినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అధికారులు పంపిన యువకులపై దాడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకులు దేవినేని ఉమ, దేవినేని అవినాష్, జనార్దన్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్‌కుమార్‌ రెచ్చిపోయి తమ అనుచరులతో పోలీసుల వాహనాలపై దాడి చేయడం, పోలీసులను కొట్టడం చేశారు. దీంతో పోలీసులు ఆ రోజు ధర్నాలో పాల్గొన్న తాడేపల్లి నాయకులతోపాటు, విజయవాడ నుంచి వచ్చిన కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: టీడీపీ ‘డ్రోన్‌’ రాద్ధాంతం)

మరిన్ని వార్తలు