బొమ్మ పడాల్సిందే!

30 Oct, 2017 08:51 IST|Sakshi

నోటీసు బోర్డులో ఉపాధ్యాయుల ఫొటోలు, ఫోన్‌నంబర్లు తప్పనిసరి

అభ్యంతరం చెబుతున్న  ఉపాధ్యాయలు

మహిళా ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన

ఏశాఖకూ లేని నిబంధనలు మాకేనా అంటూ మండిపాటు

నిడదవోలు: ‘ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆవృత్తి అంటే నాకు ఎంతో గౌరవం’.. అన్నారు అబ్దుల్‌ కలాం. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసి మెరుగైన సమాజాన్ని అందించడంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయులకు ఉన్న స్థానం అటువంటిది. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.

నోటీసుబోర్డులో వివరాలు తప్పనిసరి
తాజాగా వివిధ పాఠశాలల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫొటోలు, బోధించే సబ్జెక్టు తదిత ర వివరాలను  పాఠశాల నోటీస్‌ బోర్డులో ఏర్పా టు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14,534 మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు.

వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు
గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సాధారణంగా గ్రామస్తులందరికీ తెలిసే ఉంటారు. పాఠశాలల పునఃప్రారంభంలో గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.  ఇప్పుడు మళ్లీ కొత్తగా తమ వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలని ఆదేశాలు జారీచేయడమేమిటని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏ ఒక్క శాఖకూ లేని నిబంధనలు తమ శాఖకు మాత్రమే అమలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఏమన్నా ఖైదీలమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల మహిళా ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తుత్తాయని చెబుతున్నారు.

కేంద్రం నుంచి ఆదేశాలు
ఉపాధ్యాయుడి పేరు, బోధించే సబ్జెక్టు, ఐడీ నంబర్, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని అన్ని పాఠశాలలకు సర్కిలర్లు పంపారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో  దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది పాఠశాలలకు గ్రేడ్లు నిర్ణయించేటప్పుడు ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్న స్కూళ్లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వనున్నారు. దాంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

మహిళా ఉపాధ్యాయుల ఆందోళన
మహిళా ఉపాధ్యాయులకు కూడా మినహాయింపు లేకుండా వివరాలు నోటీసుబోర్డులో పెట్టాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే తమ ఫోన్‌ నంబర్లు, వివరాలు ఇలా బహిర్గతం చేయడం వల్ల తమకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మహిళా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం
పాఠశాలల్లో నోటీస్‌ బోర్డుల్లో ఉపాధ్యాయుల ఫొటోలు, ఫోన్‌ నంబర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఖైదీల్లా కనిపిస్తున్నామా..? ఈ నిర్ణయం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. అవివాహితులైన మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. దీనివల్ల వారికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నిర్లయాన్ని విరమించుకోని పక్షంలో అన్ని యూనియన్‌ నాయకులతో సమష్టిగా ఉద్యమం చేపడతాం.                 
– పి.జయకర్, జిల్లా యూటీఎఫ్‌ అధ్యక్షుడు, నిడదవోలు


ఏశాఖకూ లేని నిబంధనలు మాకేనా?
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో లేని నిబంధనలు విద్యాశాఖకు మాత్రమే అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఉపాధ్యాయుల వివరాలను ఎప్పుడో ఆన్‌లైన్‌లో ఉంచారు. కొత్తగా నోటీస్‌ బోర్డుల్లో పెడితే మహిళా ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతింటాయి. వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారు..?
 – చెరకు శ్రీనివాస్, పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి, నిడదవోలు

మరిన్ని వార్తలు