మేధోమథనం.. అంతర్మథనం..

11 Nov, 2013 03:46 IST|Sakshi
మేధోమథనం.. అంతర్మథనం..

సాక్షి ప్రతినిధి నిజామాబాద్ :  జిల్లా తెలుగుదేశంలో అయోమయం నెలకొంది. తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్ర విభజన పక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాం తం... ఢిల్లీలో దీక్ష ..సమన్యాయం పేరుతో పూటకో మాట.. తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పైగా పార్టీలోని కొందరు ముఖ్యనేతలు సమైక్యాంధ్ర కోసం కోర్టుకు వెళ్లటం వం టి అంశాలు కూడా తీవ్ర నిర్వేదానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్ల రాజకీయ భవితవ్యంపై చర్చ జరుగుతుండగా...పయనమెటనే విషయంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, అరికల నర్సారెడ్డిలతో పాటు పలువురి జిల్లా, నియోజక వర్గం స్థాయి నాయకుల రాజకీయ ముందడుగుపై రాజకీయ వర్గాలు, ముఖ్యంగా పార్టీ కేడర్‌లో రసవత్తరమైన చర్చ సాగుతోంది.

అదేవిధంగా జీవోఎంకు విభజనపై అధినేత బాబు నివేదిక ఇవ్వక పోవటంపై కూడా తమ్ముళ్లను మరింత నైరాశ్యంలోకి నెట్టినట్లయింది. పైగా ముందున్న విభజన సమస్యపై స్పష్టత ఇవ్వకుండా రానున్న ఎన్నికల కోసం మేధోమథనసదస్సులు నిర్వహిం చటం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇదివరకే ఢిల్లీ దీక్షలకు కచ్చితంగా రావాలని ఒత్తిడి చేయటంతో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లి వచ్చారు. ఇది వారిని ఇరుకున పెట్టగా అంతర్మథనంలో పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడటం ఎలాగన్న ఆలోచనలు వారిని రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కునేలా చేస్తున్నాయి. ఇదే తరుణంలో ఈ నెల 11,12 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌లో నిర్వహించతల పెట్టిన మేధోమథన సదస్సుకు  జిల్లా నుంచి  30 మందికి పైగా ప్రతి నిధులు హాజరుకావాలని  అధిష్టాన వర్గం నుంచి  పిలుపురావడం  తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. సదస్సుకు జిల్లా నుంచి 30 మంది ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంది.

  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కార్యవర్గం, నియోజక వర్గ ఇన్‌చార్జిలు, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాల్లో ఇన్‌చార్జిలు లేకపోవడంతో త్రిసభ్యకమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేధోమథన సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే అధినేత చంద్రబాబు సమన్యాయం పేరుతో సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో మేధోమథన సదస్సుకు హాజరు వారికి సందిగ్ధంగా మారింది.

మరిన్ని వార్తలు