‘టెన్’షన్

25 Mar, 2014 00:24 IST|Sakshi

 27 నుంచి పదో తరగతి పరీక్షలు
 
 కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఏడాది కష్టానికి ‘పరీక్ష’. భానుడు ఉగ్రరూపం దాల్చగా.. ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కుల గోల నుంచి ఉపశమనం లభించినా.. గ్రేడింగ్‌లో ముందుండాలనే తపన ప్రతి విద్యార్థిలో కనిపిస్తోంది. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెగ్యులర్‌గా 47,057.. ప్రైవేట్‌గా 6,293 మంది కలిపి 53,350 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

రెగ్యులర్ విద్యార్థులకు 199, ప్రైవేట్ విద్యార్థులకు 28 మంది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మకమైనవిగా 19 కేంద్రాలను గుర్తించారు. ప్రశ్నపత్రాలను 75 పాయింట్లలో సోరేజ్ చేయగా.. 227 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించారు. మరో 20 శాతం మందిని రిజర్వులో ఉచారు. వీరితో పాటు 2,667 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 11 మంది విద్యాధికారులు, 11 మంది ఎమ్మార్వోలు, 11 మంది ఎస్‌ఐలతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటైంది. ఏప్రిల్ 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది.

ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్‌ఎంచే అత్యవసర మందులను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేశారు. అయితే అధిక శాతం పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సమస్య వేధిస్తోంది. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించరాదని.. ప్రతిరోజూ ఉదయం 8.45 గంటల్లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు హెల్ప్‌లైన్ నెంబర్ 98499 32289, 08518-277064 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు