అది బాబు మైండ్ గేమ్

16 Jan, 2014 03:23 IST|Sakshi
అది బాబు మైండ్ గేమ్

* ఓ పత్రికలో కథనంపై వైఎస్సార్‌సీపీ నేత రఘురామకృష్ణంరాజు
* జగన్‌తో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి
* వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం
 
సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా): విజయం సాధించలేననే అనుమానంతో పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తాడేపల్లిగూడెంలో మంగళవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై వచ్చిన కథనాన్ని గోబెల్స్ ప్రచారంగా అభివర్ణించారు.

ఆ పత్రిక ఉద్దేశపూర్వకంగానే ఇదంతా రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్‌గేమ్ అని విమర్శించారు. సమావేశంలో పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, పట్టణ కన్వీనర్ యెగ్గిన నాగబాబు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెన్నేటి జగ్జీవన్ పాల్గొన్నారు.

 ఆయనేమన్నారు?
* మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిపై నేను అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం అభూత కల్పన. ఆయనతో నేను సన్నిహితంగా ఉంటా, ఎలాంటి విభేదాలూ లేవు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నా. ఒక సర్వే ప్రకారం నియోజకవర్గంలో నాకు 53 నుంచి 54 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర పార్టీ, తెలుగుదేశం విభజన పార్టీ. కోస్తాంధ్రలోనే మా పార్టీకి 140 నుంచి 145 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది. తెలంగాణలోనూ గణనీయమైన సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.

* ఈ నెల 23వ తేదీన తర్వాత కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన వారంతా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులు దొరకడంలేదు. అందుకే బలంగా ఉన్న మా పార్టీని బలహీనంగా చూపించడానికి ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారు.
     

* విభజన పార్టీ అయిన తెలుగుదేశం రెండు ప్రాంతాల్లో రెండు వాదనలు వినిపిస్తోంది. తెలంగాణలో ఎర్రబెల్లి, కోస్తాంధ్రలో పయ్యావుల కేశవ్ విభిన్న వాదనలు ఎలా వినిపిస్తారు?
   

* ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ చాలా చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వెనక్కు తగ్గుతున్నట్లు ఎలా రాస్తారు? విజయవాడ నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేయనని వెనక్కి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదం. ఆయనసలు మా పార్టీలోనే లేరుకదా. 

మరిన్ని వార్తలు