అమరావతి నిర్మాణానికి తొలి అడుగు

7 Jun, 2015 04:35 IST|Sakshi
అమరావతి నిర్మాణానికి తొలి అడుగు

♦ వేదపండితుల మధ్య భూమిపూజ
♦ భూములిచ్చిన రైతులకు  సీఎం అభినందనలు
♦ ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణానికి
♦ సహకరించాలని కోరిన చంద్రబాబు
♦ దసరా నుంచి రాజధాని పనులు ప్రారంభమవుతాయని వెల్లడి

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన శకానికి నాంది పలికారు. ఆంధ్రుల తొలి రాజధాని అమరావతిని మలి రాజధానిగా నిర్ణయించి దాని నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. తుళ్ళూరు మండలం మందడం తాళ్ళయిపాలెం మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ చంద్రబాబు దంపతులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి నల్లూరి దాశరథి ఆధ్యర్యంలో ఉదయం మూడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 9 గంటల వర కూ కొనసాగింది.

స్థల, వాస్తుదోష నివారణ పూజల అనంతరం భూమిపూజ చేశారు. భూమిపూజకు ఈశాన్యంగా ఉన్న పొలంలో సీఎం సతీమణి భువనేశ్వరి నవధాన్యాలు చల్లగా.. చంద్రబాబు హలం పట్టి నాగలితో దున్ని ఏరువాక సాగించారు. ఈ సమయంలోనే వర్షం చినుకులు పడటంతో వరుణుడు కూడా హర్షం వ్యక్తం చేశాడని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 బంగారు రాజధానికి కేంద్రం నిధులు
 ఈ సందర్భం గా జరిగిన స భా కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ ఆంధ్రులు మెచ్చే బంగారు రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను అభినందించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు, గౌతమ బుద్ధుడు నడయాడిన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం తన పూర్వ జన్మసుకృతమన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఈ సందర్భంగా ప్రసంగించారు. పలువురు రైతు లు, ఎన్‌ఆర్‌ఐలు రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు.

 సంపద పెరిగే మార్గాలు చెబుతా..
 సీఎం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణంతో రైతులు కోటీశ్వరులయ్యారని చెప్పారు. సంపద పెరిగే మార్గాలు రైతులకు చెబుతానని తెలిపారు. దసరా నుంచి రాజధాని పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణానికి అన్ని వర్గాలూ సహకరించాలని కోరారు. ఈషా అనే నాల్గో తరగతి విద్యార్థి తిరుపతి నుంచి స్కేటింగ్ చేసుకుంటూ రాజధాని చేరుకుంది. తన వంతుగా రాజధాని నిర్మాణానికి తన పొదుపు మొత్తాన్ని విరాళంగా అందచేసింది.

సినీనటుడు బాలకృష్ణ వేదికపై హల్‌చల్‌చేశారు. తలపాగా చుట్టుకుని రావడంతో అభిమానులు, రైతులు ఈలలు, కేరింతలు కొడుడూ ప్రసంగించాలని నినాదాలు చేశారు. ఆయన ప్రసంగించకుండానే కార్యక్రమం ముగిసింది. భూమిపూజ అనంతరం పొలాలను చదును చేయాలన్న ఉద్దేశంతో సిద్ధం చేసిన ట్రాక్టర్లను వినియోగించలేదు. భూమిపూజ, సభ పూర్తికాగానే సీఎం హెలికాప్టర్ ఎక్కి గన్నవరం వెళ్లిపోయారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు