రుణమాఫీ పతనం...!

27 Aug, 2014 03:34 IST|Sakshi

ప్రభుత్వ మార్గదర్శకాల్లోని నిబంధనల వల్ల సహకార రైతులకు రుణాలు మాఫీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (సొసైటీ)  రుణాలు తీసుకుంటూ 2014 మార్చి 31వ తేదీలోపు  తిరిగి చెల్లిస్తే వారికి వడ్డీ రాయితీ లభిస్తుంది. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2013 ఖరీఫ్‌లో రుణాలు పొందిన రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. రబీలో 2014 జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ లోపు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించడం లేదు.

అదే విధంగా 2014 మార్చి 31వ తేదీలోపు అప్పు చెల్లించి ఏప్రిల్ 1 తర్వాత రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం 2013 డిసెంబర్ 31లోపు మంజూరు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడం వల్ల సగం మంది రైతులు నష్టపోతున్నారు. గత ఎన్నికల ప్రచార సందర్భంగా రుణమాఫీ పతనం...!
 
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణాలు చెల్లించని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని, ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేస్తామని డాంబికంగా హామీలిచ్చారు. అయితే ఆచరణలో వచ్చేసరికి అది అమలు కావడం లేదు.

 సగం మంది రైతులకు వర్తించని వైనం
 జిల్లాలో పీడీసీసీ బ్యాంకు ద్వారా మొత్తం 168 సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జిల్లాలో మొత్తం 85,265 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి 430 కోట్ల రుణాలు మాఫీ అవుతాయి. అయితే ఆచరణ సాధ్యం కాని నిబంధనల వల్ల సగం మంది సహకార రైతులకే రుణమాఫీ వర్తిస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2014 మార్చి 31కి ముందు ఎప్పుడు రుణాలు తీసుకున్నా రుణమాఫీ వర్తిస్తే సుమారు రైతులందరికీ లబ్ధి చేకూరుతుంది. అయితే ప్రభుత్వం సాధ్యమైనంత మేర లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి రుణమాఫీ మొత్తాన్ని కుదించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల వల్ల జిల్లాలో 40 వేల మంది రైతులు రుణమాఫీని కోల్పోవలసి వస్తోంది. సుమారు *221.79 కోట్ల రుణాల మాఫీకి ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి.

 సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులు ఏడాది లోపు ఆ రుణాన్ని చెల్లిస్తే వాటిపై వడ్డీ చెల్లించే అవసరం ఉండదు. 24 నెలలు దాటితే రైతు డీఫాల్టర్‌గా మిగులుతాడు. దీంతో సొసైటీలో పంపిణీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మిగలకుండా ఉండేందుకు, పరపతి స్థాయిని పెంచేందుకు ఏడాదిలోపే రుణాలను తిరగరాసి మళ్లీ రుణాలిచ్చే పరిస్థితి ఉంది. దీనిని రాష్ట్రస్థాయిలో ఆప్కాబ్ కూడా ప్రోత్సహిస్తోంది.

క్షేత్రస్థాయిలో సొసైటీ సిబ్బంది కూడా రైతులకు వడ్డీ మాఫీ గురించి వివరిస్తూ రుణాలను తిరగరాస్తుంటారు. అయితే ప్రస్తుతం సొసైటీలో ఈ రుణాలను తిరగరాసినందు వల్లే 40 వేల మంది రైతులు రుణమాఫీని కోల్పోవలసి వస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా మార్గదర్శకాలను సవరించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు