ఆధార్ సీడింగ్‌లో జిల్లాకు మూడో స్థానం

6 Feb, 2014 02:27 IST|Sakshi
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఆధార్ సీడింగ్‌లో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉండడంపై జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం మండల డెప్యూటీ తహసిల్దార్ల సమావేశంలో ఆధార్ సీడింగ్, పౌరపంపిణీ విధానం అమలుతీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ అమలులో 97 శాతం పూర్తి చేసిన ఉంగుటూరు డెప్యూటీ తహసిల్దార్ శారదాదేవి, 95 శాతం పూర్తి చేసిన టి.నర్సాపురం డీటీ రంజిత్, 92 శాతం పూర్తి చేసిన కొవ్వూరు అర్బన్ డీటీ ఆలీలను త్వరలోనే కలెక్టర్ సిద్ధార్థ జైన్ చేతులమీదుగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందిస్తామని జేసీ చెప్పారు.  
 
 కొత్త చౌకడిపోలు ఏర్పాటు
 జిల్లాలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న చౌకడిపోలను పునర్వవ్యవస్థీకరించి త్వరలోనే కొత్త చౌకడిపోల ఏర్పాటుకు తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జేసీ బాబూరావునాయుడు చెప్పారు. జిల్లాలో రచ్చబండ-2లో జారీ చేసిన కూపన్లలో ఇంకా 24 వేల కార్డులకు సంబంధించి ఫొటో అప్‌డేషన్ జరగలేదని, ఆ కూపన్లకు సంబంధించి నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌వో శివశంకర్ రెడ్డి, జిల్లాలోని 46 మంది డీటీలు పాల్గొన్నారు. 
 
 అంగన్‌వాడీ కార్యకర్తల 
 పోస్టులను భర్తీ చేయండి 
 ఏజెన్సీలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జేసీ, ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీవో బాబూరావునాయుడు స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ వి.వసంతబాలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏజెన్సీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఏజెన్సీలో గిరిజనుల పిల్లల సంరక్షణకు 11 క్రాషీ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 6 నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులను సంరక్షించడానికి ప్రభుత్వం పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో 11 క్రాషీ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 15 అంగన్‌వాడీ కార్యకర్తలు, 103 సహాయకుల ఉద్యోగాలు, 29 మినీ అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని జేసీ ఆదేశించారు. వసంతబాల మాట్లాడుతూ త్వరలోనే ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 
 
 సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం 
 ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారాన్ని చేపట్టి ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జేసీ టి.బాబూరావునాయుడు సమాచార శాఖాధికారులను ఆదేశించారు. సమాచార శాఖ ఏడీగా బాధ్యతలు చేపట్టిన వి.భాస్కర నరసింహం బుధవారం జేసీ బాబూరావునాయుడు, డీఆర్వోలను కలిశారు.  
>
మరిన్ని వార్తలు