కదులుతున్న డొంక

30 Apr, 2019 03:25 IST|Sakshi

సీఎస్‌ దృష్టికి ట్రాన్స్‌కోలో అక్రమాలు

ఆ మూడు కాంట్రాక్టుల్లో కుంభకోణం ఎంత?ఎన్నికల ముందేఎందుకీ పనులు?రూ.120 కోట్లుఎవరి జేబుల్లోకెళ్లాయి?విజిలెన్స్‌ నివేదికనుతొక్కిపెట్టిందెవరు?రాజధాని ప్రాంత విద్యుత్‌లైన్ల ఏర్పాట్లలో అక్రమాలుప్రభుత్వ పెద్దలు, అధికారులపాత్రపై అనుమానాలు

సాక్షి, అమరావతి
ఎన్నికల ముందు ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన మూడు కాంట్రాక్టులు వివాదాస్పదమయ్యాయి. కాంట్రాక్టుల అప్పగింతలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌తో పాటు రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం కూడా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ప్రభు త్వం దృష్టికి తెచ్చాయి. అయితే, ఇవేవీ పరిగణన లోనికి తీసుకోకుండానే హడావిడిగా కాంట్రాక్టులు ఇచ్చినట్లు సీఎస్‌ గుర్తించారు.

ఎక్కడా లేని విధంగానిబంధనలు పెట్టడం, కొన్ని కంపెనీలకు మేలుచేసే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టులు ఎక్కువ రేటుకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.  ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం.

అక్రమాల బాగోతం ఇదీ..
రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి విద్యుత్‌ లైన్లు వేయాలని ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులతో సీఆర్‌డీఏ చేపట్టే పనులను ముందుకు తీసుకొచ్చారు. గుడివాడ, చిలకలూరిపేట, ఏలూరుల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు, లైన్లకు సరిగ్గా ఎన్నికల ముందే ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. నిజానికి చాలా కంపెనీలు పోటీకి సిద్ధమయ్యాయి. తక్కువ రేటుకే పనులు చేసేందుకూ ముందుకొచ్చాయి. గుడివాడ లైన్, సబ్‌స్టేషన్‌ పనులకు రూ.600 కోట్లను ట్రాన్స్‌కో కోట్‌ చేస్తే అంతకన్నా తక్కువకే చేస్తామని పలు కంపెనీలు వచ్చాయి. దీంతో ఏపీ ట్రాన్స్‌కో ఎక్కడలేని నిబంధనలు పెట్టింది.

ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు ఎప్పుడైనా, ఎక్కడైనా మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన కాంట్రాక్టును ఏడాదిలో 10 శాతం పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అంటే.. ట్రాన్స్‌కో లైన్లు వేసే కంపెనీలు గృహ నిర్మాణ పనులుచేసి ఉన్నా ఫర్వాలేదని పేర్కొంది. అదే విధంగా లైన్, సబ్‌స్టేషన్‌ ఒకే కంపెనీ, ఒకేసారి చేసి ఉండాలి. మునుపెన్నడూ కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. దీంతో కేవలం మూడే మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఈ మూడు కూడబలుక్కుని మరీ టెండర్లు వేశాయి. ఈ మూడింటికీ వేర్వేరు పనులు అప్పగించారు.

ఆరు నెలల క్రితం వరకూ ట్రాన్స్‌కో కోట్‌చేసిన ధర కన్నా నాలుగు శాతం తక్కువకే పనులు అప్పగిస్తే, కంపెనీలు రింగ్‌ అవ్వడంవల్ల ఏకంగా నాలుగు శాతం ఎక్కువకు పనులు ఇచ్చారు. మొత్తం రూ.1200 కోట్ల విలువైన టెండర్లలో కనీసం రూ.120 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎన్నికల కోడ్‌ సమీపిస్తుండడంతో టెండర్ల ప్రక్రియను హడావుడిగా పూర్తిచేసి మార్చి మొదటి వారంలోనే పనులు అప్పగించారు. వీటన్నింటినీ విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడాన్ని ప్రస్తుత సీఎస్‌ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

జేఎండీ కథానాయకుడా?
ప్రభుత్వాధినేత కనుసన్నల్లో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో ట్రాన్స్‌కో జేఎండీ కీలకపాత్ర పోషించినట్టు సీఎస్‌కు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఆదాయ పన్నుశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా వచ్చిన ఆయనకు.. ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేసింది. డైరెక్టర్‌ స్థాయి నుంచి ఏకంగా ఆయనకు జేఎండీగా పదోన్నతి కల్పించింది. డిప్యూటేషన్‌ కాలం పూర్తయినా కేంద్ర స్థాయిలో మేనేజ్‌ చేసి ఆయనను ఇక్కడే ఉంచేందుకు టీడీపీకి చెందిన ఓ ఎంపీ విశ్వప్రయత్నం చేశారు.

జేఎండీపై ఆయన మాతృ సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో తప్పనిసరై ఆయన తిరిగి వెళ్లినట్టు ట్రాన్స్‌కో వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. మూడు కాంట్రాక్టులు తెరిచి, ఖరారు చేసే వరకూ ఆయన జేఎండీగానే కొనసాగారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి మాతృసంస్థకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనకు ఏవైనా ముడుపులు అందాయా అనే కోణంలోనూ సీఎస్‌ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.  


 

మరిన్ని వార్తలు