నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

8 May, 2015 02:20 IST|Sakshi
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

నేడు ఏపీ ఎంసెట్
ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం
మెడిసిన్ పరీక్ష
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు
హైదరాబాద్ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు
ఆర్టీసీ సమ్మెతోనే ఇబ్బందులు

హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఎంసెట్) శుక్రవారం జరగనుంది. కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిర్దేశించిన సమయంలోగా ఎంసెట్ పరీక్షకు హాజరవ్వడం దూరప్రాంతాల విద్యార్థులకు సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్టు ప్రకటించినా.. అవి అరకొరగానే ఉండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  


ఇదిలా ఉండగా ఎంసెట్-2015 సెట్‌కోడ్‌ను రాష్ర్ట మంత్రులు ఎంపికచేయనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష పత్రాన్ని మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెడిసిన్ పరీక్ష పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాకినాడలోని జేఎన్‌టీయూకేలో ఎంపిక చే స్తారని ఎంసెట్ చైర్మన్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ సాయిబాబులు తెలిపారు.


ఎంసెట్ వివరాలివీ...
ఎంసెట్‌కు మొత్తం 2,55,429 మంది ద రఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,70,685 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 84,724 మంది, రెండు విభాగాల్లోనూ 1,260 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 25 రీజనల్ కేంద్రాల పరిధిలో ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.

ఏపీలో 22 రీజనల్ కేంద్రాలు, హైదరాబాద్‌లో 3 రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంజనీరింగ్ విభాగానికి 312 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్‌కు 141 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగానికి 16 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, మెడిసిన్‌కు 22 పరీక్ష కేంద్రాలు నెలకొల్పారు. తెలంగాణలో ఏపీ ఎంసెట్‌కు 22,758 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.

ఎంసెట్ ప్రిలిమినరీ కీని 10వ తేదీన విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలను 15 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీతోపాటు ర్యాంకుల్ని మే 26న ప్రకటిస్తారు.

ప్రత్యేక బందోబస్తు :అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చే పట్టారు. పరీక్ష కేంద్రాల్లో హైటెక్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా జామర్లు ఏర్పాటుచేశారు.
 

ముందుగా చేరుకోండి...
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో, ఆ తరువాత విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను విద్యార్థుల రవాణాకు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాల వరకు ఈ బస్సులను నడుపుతున్నట్టు వివరించారు. అయితే ఈ ఏర్పాట్లు సరిపోకపోవచ్చని, విద్యార్థుల తల్లిదండ్రులే తగిన ఏర్పాట్లు చేసుకుని పిల్లలను సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా డీఎస్సీ పరీక్ష యధాతథంగా జరుగుతుందని, పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు మంత్రి చెప్పారు.
 
ప్రత్యేక ఏర్పాట్లు: ఆర్టీసీ ఎండీ
ఎంసెట్ పరీక్ష జరుగుతున్నందున ప్రతి మండలం నుంచి విద్యార్థులను తీసుకొచ్చేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు నుంచి జీపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీలో అద్దె బస్సులన్నింటినీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను చేరవేసేందుకే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ వినతితో కొన్ని ప్రైవేటు కళాశాలలూ బస్సుల్ని ఉచితంగా తిప్పేందుకు ముందుకొస్తున్నాయన్నారు. అవసరమైతే పోలీసు వాహనాలు కూడా వినియోగిస్తారని తెలిపారు.
 

కన్వీనర్ సూచనలివీ..

  • పరీక్ష రోజున ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై సంతకం చేయాలి  హాల్‌టికెట్‌లో తప్పులు దొర్లితే పరీక్ష రోజున ఇచ్చే నామినల్ రోల్‌లో ఇన్విజిలేటర్ సమక్షంలో సరిదిద్దుకోవచ్చు.
  • పరీక్షా కేంద్రానికి 2 గంటలముందే చేరుకోవాలి. హాలులోకి గంట ముందు అనుమతిస్తారు. ఒక నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించరు.
  • కేవలం హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, రెండు పెన్నులను మాత్రమే తీసుకువెళ్లాలి.
  • ఓఎంఆర్ షీట్‌ను నీలం లేదా నలుపు పెన్నుతోనే పూరించాలి. వాటిలో ఏదో ఒక రంగు పెన్నునే మొత్తం పరీక్షకు వాడాలి.
  • ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థి ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, టెస్ట్ సెంటర్‌కోడ్, పేరు, లోకల్ ఏరియా, కేటగిరీ, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్‌పైనున్న కోడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఓఎంఆర్ షీట్‌పై ఏ కోడ్ ఉంటే అదే కోడ్ గల క్వశ్చన్‌పేపర్ వచ్చిందో లేదో చూసుకోవాలి.

మరిన్ని వార్తలు