‘రథ’సారథ్యం తమ్ముళ్లకే!

9 Aug, 2017 03:31 IST|Sakshi
‘రథ’సారథ్యం తమ్ముళ్లకే!

సర్కారు పథకాలు వారికే  అందాలి. సబ్సిడీలు వారికే  మంజూరు కావాలి. పదవులు... ఉద్యోగాలు... చివరకు గ్రామాల్లో అధికారం మొత్తం ఆ  పార్టీని నమ్ముకున్నవారికే అందివ్వాలి. అదే లక్ష్యంతో ప్రస్తుత  పాలకులు ముందుకు సాగుతున్నారు. నిజమైన అర్హులున్నా... తమకు విధేయులు కాకుంటే వారికి రిక్తహస్తమే. తాజాగా రైతు రథం రాయితీపై ట్రాక్టర్ల సరఫరా పథకం లోనూ ఈ విధానమే కొనసాగుతోంది. దీనికి దరఖాస్తు దశనుంచే కుట్రలు మొదలయ్యాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

బలిజిపేట రూరల్‌(పార్వతీపురం): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు రథం–రాయితీపై ట్రాక్టర్ల సరఫరా పథకాన్ని తెలుగు తమ్ముళ్ళకే వర్తింపజేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పక్కాగా వ్యూహం రచించి... ఆ మేరకు మంజూరు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల పర్వం నుంచే అక్రమాలకు  తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 వ్యవసాయ యాంత్రీకరణలో బాగంగా రైతు రథం – 2017 పథకం కింద జిల్లాకు 320 ట్రాక్టర్లు రాయితీపై మంజూరు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ నియోజకవర్గాలకు వీటిని కేటాయించాలని నిర్దేశించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో విజయనగరంలో ఒక మండలం, మిగిలిన 8 నియోజకవర్గాల కు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. విజయనగరం నియోజకవర్గంలోని మండలానికి 8 ట్రాక్టర్లు, మిగిలిన 312 ట్రాక్టర్లు 8 నియోజకవర్గాలకు సమానంగా... ఒక్కో నియోజకవర్గానికి 39 ట్రాక్టర్లు వంతున కేటాయించారు.

ఇవీ నిబంధనలు
ఈ పథకానికి కొన్ని నిబంధనలు రూపొందిం చారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఏ పథకంలో కూడా రైతు రాయితీ ట్రాక్టరు పొంది ఉండకూడదు. రైతుకు కనీసం 2 ఎకరాల పొలం ఉండాలి. రైతుకు సొంతంగా ట్రాక్టరు ఉండరాదు. ఏ రకం ట్రాక్టరు కొనాలో రైతే నిర్ణయం తీసుకోవాలి. మంజూరయిన ట్రాక్టర్లలో ఎస్సీ, ఎస్టీ కులాలకు తగినవిధంగా కేటాయింపులు చేయాలి. అర్హులైన రైతులు నేరుగా వ్యవసాయశాఖ నుంచి దరఖాస్తు తీసుకుని దీనికి సంబంధించిన డాక్యుమెం ట్లను జతచేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. రైతులు చేసుకున్న దరఖాస్తులను వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల ద్వారా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రికి చేరుతాయి. వారి ఆదేశాలమేరకు యూనిట్లు మంజూరవుతాయి.

జిల్లాలో జరుగుతున్న తీరిదీ...
పార్వతీపురం నియోజకవర్గానికి 39 మంజూరవగా బలిజిపేట మండలానికి సుమారు 12 నుంచి 14వరకు మంజూరుకావచ్చని భావిస్తున్నారు. వీటికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తులు వేరేలా, సాధారణ రైతు దరఖాస్తు వేరేగా ఉండడంతో అవకతవకలకు మార్గం సుగమం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ ట్రాక్టరు కావాలంటే తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తు చేసుకుంటేనే వస్తుందని... లేకపోతే రథంవైపు చూడాల్సిన అవసరం లేదనే భావనలు వినిపించడంతో రైతులు నీరుగారారు.

 తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తులో స్థానిక ఎమ్మెల్యే సూచనలకు, సంతకాలకు లోబడి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దరఖాస్తులో ‘నా యొక్క దరఖాస్తు గ్రామ, మండల జన్మభూమి కమిటీ, పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా వ్యవసాయ శాఖకు సమర్పించుట గురించి’ అని ఉండడం, దరఖాస్తు చివరన ఎమ్మెల్యే సంతకానికి కాలమ్‌ ఏర్పాటు చేశారు.

అంటే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే రథాలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. సిఫార్సులు లేనివారు తమ దరఖాస్తులను సాదా సీదాగా వ్యవసాయశాఖ కార్యాలయానికి అందజేశారు. రైతు రథం పథకానికి మండలంలో ఇప్పటికి 20మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో 14మంది తెలుగు తమ్ముళ్ళు ఉన్నట్టు సమాచారం.  అంటే వారికే ట్రాక్టర్లు మంజూరవుతాయన్నది జగమెరిగిన సత్యం.

ఎమ్మెల్యే సిఫార్సులుంటాయనే వస్తాయని...
రైతురథం పథకంలో సబ్సిడీ ట్రాక్టరు పొందేందుకు ఎమ్మెల్యే సిఫార్సు చేసిన దరఖాస్తు ఉంటేనే వచ్చే అవకాశాలున్నాయని విశ్వయనీయంగా తెలియ డం, ఎమ్మెల్యే సూచనల మేర తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి ప్రత్యేక దరఖాస్తులు తెచ్చుకుని ఆన్‌లైన్‌ చేయడం చూసి నేను దరఖాస్తు చేయడం మానుకున్నాను. పక్కాగా తెలుగు తమ్ముళ్ళకే వస్తాయని తెలిసిన తరువాత చేయడం ఎందుకని మానేశాను.       
– ప్రసాద్, సర్పంచ్, నారాయణపురం.

ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు:
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి అనర్హులను తొలగించి అర్హులైనవాటిని జిల్లా యంత్రాంగానికి అందిస్తాం. అక్కడి నుంచి ఇన్‌చార్జ్‌ మంత్రికి సమర్పిస్తాం. పథకంలో లబ్ధి పొందేది ఎవరో అప్పుడు తెలుస్తుంది.  
– భానులత, ఏడీ,
వ్యవసాయ శాఖ, బొబ్బిలి

మరిన్ని వార్తలు