కేసీఆర్‌కు భద్రత పెంచాలి: టీఆర్ఎస్

9 Aug, 2013 02:31 IST|Sakshi
కేసీఆర్‌కు భద్రత పెంచాలి: టీఆర్ఎస్

గవర్నర్, డీజీపీలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వినతి
 సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత, ఎంపీ కె.చంద్రశేఖర్‌రావుకు భద్రతను పెంచాలని, బెదిరింపు ఫోన్లపై విచారణ జరిపించాలని  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను, డీజీపీ దినేష్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాల్ని సమర్పించారు. అనంతరం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్‌కు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయనీ, ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నట్లుగా తమ దగ్గర  ఆధారాలు ఉన్నాయని, వీటిని గవర్నర్, డీజీపీలకు అందించినట్టుగా చెప్పారు.
 
  తెలంగాణ ఉద్యమ నేతను చంపడానికి కూడా పూనుకోవడం అత్యంత దారుణం, నీచమని ఈటెల విమర్శించారు. కేసీఆర్‌కు ఏదైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. గవర్నరు వెంటనే స్పందించి ఈ బెదిరింపు ఫోన్లపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి కారకులను గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కేసీఆర్‌కు జడ్‌ప్లస్ భద్రతను కల్పించాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఈటెల డిమాండ్ చేశారు.  గవర్నరును, డీజీపిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, డాక్టర్ టి.రాజయ్య, జూపల్లి కృష్ణారావు, నల్లాల ఓదేలు, హరీశ్వర్‌రెడ్డి, గంప గోవర్దన్, మొలుగూరి బిక్షపతి, అరవింద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు