'రాష్ట్రాన్ని సింగపూర్‌కు తాకట్టుపెట్టారు'

24 Aug, 2015 21:23 IST|Sakshi

వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ ప్రతినిధులకు తాకట్టు పెట్టారని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వారికి లబ్ధి చేకూర్చి తద్వారా ఆయన లాభపడటానికి రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లెలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బలవంతంగా రైతుల భూములను లాక్కోవడం మంచిది కాదన్నారు. చంద్రబాబు.. సింగఫూర్ వ్యాపార ప్రతినిధులతో లాలూచీ పడటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజధానికి సంబంధించి ఇప్పటికే 33 వేల ఎకరాలు సమీకరించారన్నారు.

 

అగ్ర రాజ్యమైన అమెరికా రాజధాని కూడా 7,422 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకూ చంద్రబాబు ఒకే చోట రాజధానులు కడుతున్నారా అని ఎద్దేవా చేశారు. సేకరించిన భూమి చాలదన్నట్లు మూడు పంటలు పండే రైతుల భూములనూ లాక్కోవాల్సిన అవసరం ఏముందన్నారు. సింగఫూర్ కంపెనీలకు ఇక్కడి భూమిని 99 ఏళ్లు లీజుకు ఇస్తున్నారంటే మరో ఈస్టిండియా కంపెనీ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మంగళవారం ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు సాధించుకుని రావాలన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు