-

2022 కల్లా టాప్-3లో ఏపీ

11 Feb, 2015 01:41 IST|Sakshi
2022 కల్లా టాప్-3లో ఏపీ

పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ రాష్ట్రం మాది
‘డిప్లమసీ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సులో సీఎం చంద్రబాబు

 
న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఉండే మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘డిప్లమసీ ఫర్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై జరిగిన రాయబారుల సదస్సులో బాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ 974 కి.మీ. కోస్తాతీరంతో ఇండియా గేట్ వేగా మారింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే, రోడ్డు రవాణా తదితర మౌలిక వసతులున్నాయి. వాటర్, గ్యాస్, పవర్, రోడ్, ఫైబర్ తదితర 5 గ్రిడ్‌లు, 7 మిషన్లతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. 2022 నాటికి టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండబోతోంది. 2029 నాటికి హై హ్యాపీనెస్ ఇండెక్స్ రాష్ట్రంగా మారనుంది. 2050 నాటికి అత్యంత ప్రాధాన్యత గల అంతర్జాతీయ గేట్ వేగా మారుతుంది. విభిన్న పాలసీలతో పాలనను మెరుగుపరిచాం. పెట్టుబడులు తరలివచ్చేందుకు వీలుగా సౌర, పవన విద్యుత్ విధానాలు, ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ఇండస్ట్రియల్ వాటర్ పాలసీ, టూరిజం పాలసీ, పీపీపీ పాలసీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ పాలసీ, కార్మిక రంగ సంస్కరణలు.. ఇలా అనేక పాలసీలు రూపొందించాం. 24 గంటల కరెంటు, 4 లక్షల హెక్టార్ల ల్యాండ్ బ్యాంక్, 20 ఎంబీపీఎస్ కనెక్టివిటీ తదితర వసతులు ఏపీకి మాత్రమే సొంతం. విభిన్న రంగాల్లో పెట్టుబడులకు 9 క్లస్టర్లను రూపొందించాం. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కాబోతున్నాయి. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఐటీఐఆర్ నెలకొనబోతున్నాయి. పెట్టుబడులకు అపరిమితమైన వనరులు ఉన్నాయి’ అని చంద్రబాబు వివరించారు.  

సిట్ సలహాదారుతో భేటీ

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్ మాజీ చైర్మన్, నల్లధనంపై కేంద్రం వేసిన స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్(సిట్)కు సలహాదారుగా ఉన్న కె.వి.చౌదరితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్న సీఎం కాటేజీలో ఇరువురూ భేటీ అయ్యారు. అలాగే ఎన్టీపీసీ చైర్మన్ అరూప్‌రాయ్‌తో కూడా సీఎం భేటీ అయ్యారు. విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన 400 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు, 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు. వాటికి 5 వేల ఎకరాల స్థలం అవసరమని, రాయితీపై స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. అలాగే ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ప్రాజెక్టులపైనా సమీక్షించారు. భారత్‌లో మలేిసియా హైకమిషనర్ దాతుక్ నైమున్ అషక్లి బిన్ మహ్మద్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.
 

మరిన్ని వార్తలు