వ్యాక్సిన్ మాయ

3 Mar, 2015 01:55 IST|Sakshi
వ్యాక్సిన్ మాయ

వ్యాక్సిన్ పేరుతో రోగులను దోచుకుంటున్న వైనం
దళారుల అవతారమెత్తుతున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది
ఒక్క ఫోన్ చేస్తే చాలు నేరుగా పేషంట్ వద్దకే..
రూ.లక్షల్లో దండుకుంటున్న ఏజెన్సీలు, వైద్య సిబ్బంది

 
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు కలసి వ్యాక్సిన్ పేరుతో పేదలను దోచేస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన మహిళలను, ప్రసవానంతరం వారి అవసరాన్ని బట్టి వేసే వ్యాక్సిన్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. దళారుల అవతారమెత్తిన కొందరు వైద్య సిబ్బంది కనుసన్నల్లో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ‘సాక్షి’ నిఘాలో ఈ దందా వెలుగులోకి వచ్చింది.                   - తిరుపతి కార్పొరేషన్
 
రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రికి రోజుకు వందల సంఖ్యలో గర్భవతులు వైద్యసేవలకోసం వస్తూంటారు. నెల లు నిండిన గర్భవతులకు ఇక్కడే కాన్పు లు చేస్తుంటారు. ఈనేపథ్యంలో సహజంగా అధికశాతం ప్రసవం అనంతరం పురిటి బిడ్డలకు కామెర్లు వస్తుంటాయి. దీని నివారణకు హెపటైటిస్ బి వ్యా క్సిన్ వేయాల్సి ఉంది. అయితే కొంత కాలంగా ప్రభుత్వం వ్యాక్సిన్‌ను సరఫరా చేయకపోవడంతో దీన్ని కొంతమంది వైద్యులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆస్పత్రిలోని సిబ్బంది ద్వారా ఏజెన్సీలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని దళారుల అవతారమెత్తుతున్నారు. డీపీసీఏ యాక్టు ప్రకారం వ్యాక్సిన్‌లు, ఇతర మందులను నేరుగా ఆస్పత్రి ఆవరణలో రోగులకు విక్రయించకూడదు. డీపీసీఏ (డ్రగ్‌ప్రైజ్ కంట్రోల్ యాక్టు) నిబంధనలకు తూట్లు పొడుస్తూ రెట్టింపు ధరకు యథేచ్ఛగా విక్రయిస్తూ  లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు.
 
రోగులకు కుచ్చు టోపీ


ప్రసవానంతరం పురిటి బిడ్డకు 24 గంటల్లోపు కామెర్ల నివారణకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా వైద్యుల సిఫార్సు చేస్తే మెడికల్ షాపు నుంచి వ్యాక్సిన్ తెప్పించుకుంటారు. కానీ ఇక్కడి వైద్యులు మాత్రం నగరంలోని ఓ ఏజెన్సీతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నారు. రోగి అవసరం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాక్సిన్ కోసం ఫలానా ఏజెన్సీకి వెళ్లండి, లేకుంటే ఫలానా ఫోన్ నెంబ రుకు కాల్ చేయండి వాళ్లే మీ వద్దకు తెచ్చిస్తారు’ అని నమ్మిస్తున్నారు. పైగా ఆసుపత్రుల్లోని గోడలపై ఆ సెల్ నెంబర్లు రాస్తున్నారు. వైద్యులు, సిబ్బంది మాటల ఉచ్చులో పడి ఫోన్ నెంబర్ కాల్ చేయడంతో దళారులు నిమిషాల్లో ఆస్పత్రిలోని రోగి ముందు ప్రత్యక్షమై వ్యాక్సిన్ విక్రయించి అందిన కాడికి దోచుకొంటున్నారు.

సాధారణంగా రూ.1000 నుంచి రూ.3500 వరకు హెపటైటిస్-బి వ్యాక్సిన్లు లభిస్తుంటాయి. తాజాగా సాక్షి నిఘాలో భాగంగా ఏజెన్సీ సెల్‌కు కాల్‌చేస్తే ఓ వ్యక్తి ఎంఆర్‌పి ధర రూ.7వేలు అని ముద్రించి ఉన్న వ్యాక్సిన్‌ను తెచ్చి విక్రయించాడు. ఇదే వ్యాక్సిన్‌ను మెడికల్ షాపులో చూపించి ధరను విచారించగా రూ.3,500 విక్రయిస్తున్నట్టు తెలి పారు. అంటే ఏజెన్సీ వారు రోగికి రూ.7వేలుకు విక్రయించి ఆపై వచ్చిన ఆదాయం (రూ.3,500) వైద్యులు,  సిబ్బందికి ముట్టజెప్పుతున్నారని తె లుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే ఏజెన్సీ వారు ఇస్తే తాను విక్రయించానని, ఇం దులో ఆసుపత్రిలోని వైద్యాధికారుల కు కమీషన్ ఇస్తున్నామని తెలిపారు.

విచారణ జరిపిస్తాం

 ఆసుపత్రుల్లో హెపటైటిస్-బీ వ్యాక్సిన్ సరఫరా లేదు. దీంతో స్లిప్‌ల్లో రాసి మెడికల్ షాపుల్లో తెమ్మని చెబుతున్నాం. కొనుగోలులో కొందరు వైద్యులు, సిబ్బంది హస్తం ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా బాధితులు నా దృష్టికి తెస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యాక్సిన్ విక్రయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాను.
 -యశోదాబాయి, ఆర్‌ఎంవో, మెటర్నటీ ఆసుపత్రి                  

మరిన్ని వార్తలు