మెడికల్‌షాపులపై విజిలెన్స్‌ దాడులు

13 Dec, 2018 11:06 IST|Sakshi
బద్వేలులో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

అన్నిరకాల అనుమతులపై ఆరా

హెచ్‌–1 రిజిస్టర్‌ను అప్‌డేట్‌ చేయాలి

డీఎస్పీ రాజశేఖర్‌ రాజు వెల్లడి

కడప, బద్వేలు, మైదుకూరులో తనిఖీలు

కడప అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ఉదయం నుంచి మెడికల్‌ షాపులపై దాడులు నిర్వహించారు. జిల్లాలో కడప నగరం, బద్వేలు, మైదుకూరు పట్టణాల్లోని మెడికల్‌ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఏడురోడ్ల కూడలి, ఎర్రముక్కపల్లె ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో ఏడు మెడికల్‌ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ రాజశేఖర్‌ రాజు మాట్లాడుతూ మెడికల్‌ షాపుల్లో తప్పనిసరిగా డ్రగ్‌ కంట్రోల్‌ వారి అనుమతులను తీసుకోవాలన్నారు. ఫార్మసిస్ట్‌ కచ్చితంగా ఈ షాపుల్లో పనిచేయాలన్నారు. ప్రతి చోటా ఫార్మసిస్ట్‌ ఒక్కరే పనిచేస్తూ, మిగిలినవారు అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్నారన్నారు.

ఎఫ్‌సీసీఐ వారి లోగో ఉన్న ఆహార ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలని సూచించారు. ఇందుకు పుడ్‌లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. కొన్ని దుకాణాల్లో బిస్కెట్స్, చాక్లెట్స్‌తో పాటు, ఫుడ్‌ సప్లిమెంట్స్‌ విక్రయిన్నారన్నారు. కాలంచెల్లిన మందులను కౌంటర్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసుకుని, విక్రయాలకు దూరంగా పెట్టుకోవాలన్నారు. ఎంఆర్‌పీ రేట్లకంటే తక్కువ ధరలకు విక్రయించాల్సిన జనరిక్‌ మందులను కూడా ప్రతి షాపులో అందుబాటులో ఉంచాలన్నారు. హెచ్‌–1 రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. నిషేధిత మందులను షాపుల్లో పెట్టరాదని, ఫిజిషియన్‌ శాంపిల్స్‌ను విక్రయించరాదన్నారు. డాక్టర్‌ల ప్రిస్కిప్షన్‌ మేరకే మందులు ఇవ్వాలని సూచించారు. బిల్స్, ఇన్‌వాయిస్‌లను వినియోగదారులకు కచ్చితంగా ఇవ్వాలన్నారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని డీఎస్పీ తెలిపారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బద్వేలు అర్బన్‌/మైదుకూరు : పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడికల్‌ షాపులపై బుధవారం విజిలెన్స్‌ దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ సీఐలు లింగప్ప, నాగరాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో కొన్ని షాపుల్లో కాలం చెల్లిన మందులను గుర్తించారు. అలాగే ఆయా దుకా ణాలకు ఫుడ్‌లైసెన్స్‌ లేనట్లు గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నివేదిక తయారు చేశారు. మైదుకూరులో ఐదు దుకాణా ల్లో దాడులు నిర్వహించారు. ఆయా షాపుల్లో రికా ర్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ ఖాదర్‌బాషా, హెడ్‌కానిస్టేబుళ్లు ప్రసాద్, హరి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు