వెంకటాయపాలెంలో దాహం కేకలు

13 Mar, 2019 14:56 IST|Sakshi
బోరు వద్ద మంచినీటి బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు

 మోటర్‌ కాలిపోయి నెలరోజులు

నేటికీ మరమ్మతులు పూర్తికాని వైనం

పట్టించుకోని అధికారులు 

సాక్షి, వెంకటాయపాలెం(నూజివీడు): మండలంలోని వెంకటాయపాలెంలో ఓసీ ఏరియాలో మంచినీటి సమస్య నెలకొనడంతో స్థానికులు దాహం కేకలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మంచినీటి కష్టాలు మరింతగా పెరిగాయి. పంచాయతీ బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ మోటర్‌ కాలిపోయి నెలరోజులు గడిచినప్పటికీ మరమ్మతులు చేయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది.

దీంతో స్థానికులు మంచినీళ్ల కోసం, వాడుకోవడానికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఎన్నిసార్లు  పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు 50 గృహాల వారికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎస్సీ ఏరియాలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంక్‌ నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే వస్తున్నాయని, ఆ నీరు తాగడానికి పనికిరావని మహిళలు పేర్కొంటున్నారు.

వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఇంకేమీ పట్టించుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం మోటర్‌లో వైరింగ్‌ కాలిపోవడంతో మరమ్మతుల కోసమని తీసుకెళ్లారే గాని ఇంత వరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడం దారుణం.

మరమ్మతులు అయ్యే వరకు నీళ్లు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక పాలన అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన బోరుకు మోటర్‌ను బిగించేలా  చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

తాగడానికి నీళ్లు లేవు
నెలరోజుల నుంచి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మోటర్‌ కాలిపోయి నెలరోజులు అయినా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. వేసవి వచ్చిన నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి 
– పూజారి సుజాత, వెంకటాయపాలెం

అధికారులు పట్టించుకోవడం లేదు
నెలరోజులుగా నీటి సమస్య ఉంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు గ్రామానికి వస్తున్నారో, రావడం లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే  గ్రామస్తులు ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. 
– షేక్‌ ఆషా, వెంకటాయపాలెం 

మరిన్ని వార్తలు