ఐక్యంగా ఆశయాలు సాధించుకుందాం

15 Sep, 2014 02:49 IST|Sakshi

ఒంగోలు: కాపులంతా ఐక్యంగా ఉండి...ఆశయాలను సాధించుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. స్థానిక బచ్చలబాలయ్య క ల్యాణ మండపంలో ఆదివారం అఖిల భారత కాపు సమాఖ్య ఏర్పాటు చేసిన కాపు ప్రజాప్రతినిధుల సన్మాన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారసులైన కాపు సంఘాలన్నీ ఐక్యంగా ఒకే గొడుగు కిందకు రావాలని, అందుకు తాను కూడా కృషిచేస్తానని పిలుపునిచ్చారు.

ఆర్థికంగా, సామాజికంగా కాపులు ఎదిగేందుకు చంద్రబాబు ఏటా వెయ్యి కోట్లు చొప్పున ప్రకటించారని, కాపులను బీసీల్లో చేర్చాలనే ఉద్దేశంతోనే బీసీ కమిషన్ వేశారన్నారు. కమిషన్ ప్రక్రియ ప్రారంభించిన 6 నెలల్లో రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందని, అది రాగానే ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను కూడా బీసీల్లో చేరుస్తారని ప్రకటించారు. కాపు పేద విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవసరమైన స్టడీ సర్కిల్ ప్రకాశం జిల్లాలోనే ప్రారంభించడానికి కృషి చేస్తానన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాపులందరినీ ఐక్యం చేసేందుకు అన్ని ప్రాంతాల్లో తాను పర్యటిస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఏడాదిలో పూర్తిచేస్తారన్నారు.   రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తమ గెలుపునకు కాపులే కారణమని ప్రకటించారు. పశ్చిమగోదావరికి చెందిన కాపు నాయకుడు రామాంజనేయులు మాట్లాడుతూ తనకు పవర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నిత్యం ప్రకటిస్తున్నాడంటే కాపుల శక్తి ఏమిటో స్వయంగా అర్థమవుతుందన్నారు.

 సభాధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడంతోపాటు కాపులకు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబుకు వినతిపత్రం అందజేశామన్నారు. అఖిల భారత కాపు సమాఖ్య మహిళా చైర్‌పర్సన్ చదలవాడ సుచరిత మాట్లాడుతూ కాపులు పల్లకీలు మోసేవారు కాదు...పల్లకీలో ఉండేవారు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో సీఎంగా కాపు సామాజికవర్గం వారే ఉండేలా చూడాలన్నారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవి కూడా సీఎం పదవికి చాలా దగ్గరగానే ఉందంటూ పేర్కొన్నారు.


 మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రతిసారీ మ్యానిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని ప్రకటించడం...అనంతరం విస్మరించడం పరిపాటే  అన్నారు. అనంతరం బాలిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎంను ఘనంగా సన్మానించారు. సమావేశంలో కర్నాటక బలిజ సంఘం ప్రతినిధి హరి, మార్కాపురం నాయకుడు తాటిశెట్టి రామమోహన్, ఒంగోలు కాపు నాయకులు గాదె కృష్ణారావు, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

 కార్యక్రమానికి ముందుగా శ్రీకృష్ణదేవరాయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అఖిల భారత కాపు సమాఖ్య లోగో ను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి శిద్దా రాఘవరావు ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు