ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్న వివాహిత

24 Apr, 2018 13:52 IST|Sakshi
భర్త కుటుంబ సభ్యులతో రేషన్‌కార్డుకు తీసుకున్న ఫోటో(ఫైల్‌)

కాశీబుగ్గ : ఏం కష్టం వచ్చిందో తెలీదు.. కట్టుకున్న భర్తను వదిలి.. కన్నబిడ్డను కూడా వదిలి ఆ వివాహిత బలవంతంగా ఊపిరి ఆపుకుంది. రెండున్నరేళ్ల కుమారుడు అమ్మ కోసం రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. పలాస మండలం లొద్దభద్ర పంచాయతీ శాసనాంలో సోమవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రామానికి చెందిన కుప్పిలి మోహిని(24) సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వారు తెలిపిన వివరాల మేరకు..మోహిని తన భర్త మధుసూదన రెడ్డితో కలిసి శాసనాంలోని సొంతింటిలో నివాసముంటున్నారు.

భర్తతో కలిసి మేడపై నివాసముంటుండగా, మిగిలిన కుటుంబ సభ్యులు కింద ఉంటున్నారు. మధుసూదనరెడ్డి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నారు. మోహిని కూడా టైలరింగ్‌లో శిక్షణ పొంది పనిచేస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల మనోజ్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.

ఏమైందో ఏమో గానీ సోమవారం మధ్యాహ్నం కుమారుడిని కింద ఉన్న వారికి అప్పగించి మేడపైకి వెళ్లి ఉరి పోసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి కూడా ఇటీవలే మరణించారు. చూపు లేని నానమ్మ ఘటనా స్థలానికి చేరుకుని రోదించిన తీరు అందరికీ కంటతడి పెట్టించింది. కాశీబుగ్గ ఎస్‌ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు