పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం, విదేశాల నుంచి వస్తుంటాయి

14 Nov, 2023 13:10 IST|Sakshi

తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు.   

పెలికాన్‌ 

  •  పెలికాన్‌ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది.
  • దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. 
  •  దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే  సామర్థ్యం ఉంది. 
  •  దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 
  • 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది.  దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. 
  • రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్‌ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 


పెయింటెడ్‌ స్టార్క్‌ 

  • పెయింటెడ్‌ స్టార్క్‌ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. 
  • దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన  ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. 
  •  దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. 
  •  దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్‌లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు.  

120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు..  

పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. 
తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది.   
పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది.  
రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది.
నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి.   

మ్యూజియం చూసొద్దామా...
టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది.

రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి.  
సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..  

మరిన్ని వార్తలు