చెక్కు.. చిక్కు!

15 Feb, 2019 08:59 IST|Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళలు ఉరవకొండ మండలం షేక్షానుపల్లి గ్రామానికి చెందిన రామలింగేశ్వర మహిళా సంఘం సభ్యులు. వీరికి ప్రభుత్వం ‘పసుపు–కుంకుమ’ కింద  ఇచ్చిన చెక్కును ఉరవకొండ     స్టేట్‌బ్యాంకులో గురువారం వేశారు. డబ్బులివ్వాల్సిన బ్యాంకు సిబ్బంది మాత్రం సంఘానికి సంబంధించి రూ.లక్ష వరకు పాత బకాయి ఉందనీ, ఈ చెక్కును అప్పు కింద జమ చేసుకుంటున్నామని చెప్పారు. చెక్కులు తీసుకుపోతే డబ్బులిస్తారని సీఎం చంద్రబాబే చెప్పారని సంఘం లీడర్‌ చెప్పగా...ఆయన రుణమాఫీ చేయకపోవడం వల్లే ఇప్పుడు జమ చేసుకుంటున్నామని బ్యాంకు మేనేజర్‌ తెలిపారు. దీంతో కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన మహిళలు ఉత్తి చేతులతో వెనుదిరిగారు.  

ఉరవకొండ : చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’.. చెల్లని చెక్కుగా మారింది. ప్రభుత్వం చెక్కులిచ్చినా.. వాటిని తీసుకువెళ్తున్న మహిళలకు బ్యాంకు సిబ్బంది డబ్బులివ్వడం లేదు. పాత బకాయికి జమ చేసుకున్నాం.. వెళ్లిరండి అని చెబుతున్నారు. దీంతో సర్కార్‌ చేసిన మోసాన్ని గ్రహించిన మహిళలు మండిపడుతున్నారు.
 
రుణమాఫీ మోసంతోనే... 
ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలల్లో ప్రభుత్వం ఇచ్చిన ‘పుసుపు– కుంకుమ’ చెక్కులను వివిధ బ్యాంకుల్లో మహిళలు జమ చేసుకుంటున్నారు. అయితే డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం...వడ్డీలతో కలిపి బకాయి రెండింతలు కావడంతో బ్యాంకు సిబ్బంది ఈ చెక్కులను పాత అప్పులకు జమ చేసుకుంటున్నారు. దీంతో మహిళలు తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 300 సంఘాలకు సంబంధించిన ‘పసుపు–కుంకుమ’ చెక్కులు అప్పుల కింద జమ చేసినట్లు తెలిసింది.
 
రుణ ఎగవేతదారులుగా ముద్ర 
ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలకు మహిళలు బలయ్యారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో రుణం మాఫీ అవుతుందన్న దీమాతో మహిళలు బ్యాంకులకు కంతులు కట్టలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోగా...వాటి వసూలుకు ఉరవకొండ పట్టణంలోని వందలాది సంఘాలకు బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. దీంతో మహిళలు పుస్తెల తాడు, బంగారు వస్తువులు అమ్మి రుణాలు తీర్చారు. మరికొందరు అప్పు తీర్చే స్థోమత లేక రుణ ఎగవేతదారులుగా అపకీర్తి మూటగట్టుకున్నారు.    

మరిన్ని వార్తలు