తిరుపతిలో ‘స్కిల్‌’ వర్సిటీ

19 Dec, 2019 03:14 IST|Sakshi

విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌ వర్సిటీ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

ఒకే గొడుగు కిందకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు

వీటన్నింటినీ లోతుగా సమీక్షించండి

పిల్లలకు ప్రయోజనకరంగా ఉండేలా మార్పులు చేయండి 

మనం ఇచ్చే నైపుణ్య శిక్షణ ఉద్యోగం వచ్చేలా ఉండాలి

మంచి మౌలిక సదుపాయాలు కల్పించి,మంచి బోధకులను రప్పించాలి. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో అనుసంధానం కావాలి. ఉదాహరణకు కారు రిపేరులో శిక్షణ ఇవ్వాలనుకుంటే మెర్సిడెజ్‌ బెంజ్‌తో శిక్షణ ఇప్పించాలి. దీనివల్ల నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఇచ్చే శిక్షణకు ప్రపంచ దేశాల్లో మంచి విలువ ఉంటుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సూచించారు. దీనివల్ల ఏం జరుగుతోందన్నదానిపై ఒక అవగాహన ఉంటుందన్నారు. సమీక్షించడం, పర్యవేక్షించడం సులభతరం అవ్వడమే కాకుండా అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నదానిపై ఈ యూనివర్సిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. అప్పుడే ఏయే కేంద్రాల్లో ఏ తరహా శిక్షణ దొరుకుతుందన్న దానిపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుందని, దీనివల్ల పటిష్టమైన ఒక వ్యవస్థ ఏర్పడుతుందని సీఎం పేర్కొన్నారు. 

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పాలిటెక్నిక్‌ కాలేజీలు
ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ.. అవసరమైతే ఇంకోటి ఏర్పాటు చేసి, వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై ఏర్పాటయ్యే యూనివర్సిటీ వీటిని గైడ్‌ చేస్తుందన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారిలో మరింతగా నైపుణ్యం పెంపొందించేందుకే వీటిని తీసుకు వస్తున్నామని చెప్పారు. వచ్చే సమావేశం నాటికి పార్లమెంట్‌కు ఒక పాలిటెక్నిక్‌ కాలేజీని గుర్తించి, ఆ కాలేజీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేద్దామన్నారు. ఆ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆ కాలేజీలో జరగాలని, శాశ్వతంగా నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రం కావాలని సీఎం స్పష్టం చేశారు. మంచి కంపెనీల సహకారంతో మంచి పాఠ్య ప్రణాళికను రూపొందించాలని, మనం ఇచ్చే సర్టిఫికెట్‌ చూసి తప్పకుండా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండాలన్నారు. 

స్థానిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ
స్థానిక పరిశ్రమలు, వారి అవసరాలను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇవ్వాలని, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిశ్రమల ప్రతినిధులను బోర్డులో సభ్యులుగా చేర్చాలని సీఎం సూచించారు. దీనివల్ల శిక్షణ కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. హై ఎండ్‌ స్కిల్స్‌ కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి స్కిల్స్‌ను ఇక్కడ నేర్పిస్తారని, దీనిపై కూడా అధికారులు ప్రణాళిక తయారు చేయాలని సీఎం సూచించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అనేది ఒక స్కాంగా మిగిలి పోకుండా, ఒక అర్థం తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2100 చోట్ల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు వివరించగా, వాటిపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని అధికారులకు సూచించారు. దీని వల్ల నిజంగా పిల్లలు లబ్ధి పొందుతున్నారా? లేక మాటలకు మాత్రమే పరిమితం అవుతుందా? అన్నది పరిశీలించాలని ఆదేశించారు.   

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ పని తీరు ఇలా..    
- స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలకు చుక్కానిలా ఉంటుంది. 
ఎప్పటికప్పుడు వాటికి దిశ, నిర్దేశం చేస్తుంది. 
ఎప్పుడు ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలో సూచిస్తుంది.
అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ

హైఎండ్‌ స్కిల్‌ వర్సిటీ పని తీరు ఇలా..
- నైపుణ్యవంతులను మరింతగా తీర్చిదిద్దడం
రోబోటిక్స్‌లో ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించేలా కసరత్తు
విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చేలా అదనపు నైపుణ్యాలు సమకూర్చడం

మరిన్ని వార్తలు