ప్రతి ఒక్కరినీ మోసం చేశావు

31 Dec, 2018 08:29 IST|Sakshi

సీతానగరం (రాజానగరం): ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ మోసం చేశారని వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. బొబ్బిల్లంకలో ఆదివారం పార్టీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్‌ చేపట్టిన యువ శంఖారావం పాదయాత్ర ముగింపు సభను పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అద్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రుణమాఫీ పేరిట రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగ భృతి అంటూ యువతను, పెన్షన్‌ పేరుతో వృద్ధులను మోసగించారన్నారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాలను బలవంతంగా తీసుకున్నారన్నారు.

 దివంగత సీఎం వైఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధిని తానే చేసినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు పుష్కరాల్లో 30 మందిని చంపిన ఘనత, ఇసుక, మట్టి తవ్వుకుని రూ.కోట్లు కొల్లగొడుతూ.. దోపిడీకి చూపారని ఆరోపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నికల జిమ్మిక్కు లేనన్నారు. హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా జననేతతోనే సాధ్యమన్నారు. పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జననేత అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు.

 పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే తొర్రిగెడ్డ పంపింగ్‌ స్కీమ్‌ ద్వారా ఏడాదిలో పదకొండు నెలలు సాగునీరు అందిస్తామన్నారు. కాటవరం, వెంకటనగరం, చాగల్నాడు ఎత్తిపోత పథకాల ద్వారా సాగునీటిని ç అందిస్తామన్నారు. ఉద్వేగ భరితంగా సాగిన జక్కంపూడి గణేష్‌ ప్రసంగం సభికులను ఉత్తేజపర్చింది. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పరిష్కరించడానికేనని వివరించారు. 

పార్టీ నాయకులు బీవీఆర్‌ చౌదరి, ఇసుకపల్లి శ్రీనివాస్, షర్మిలారెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, కర్రి పాపారావు, అశోక్‌కుమార్‌ జైన్, నందెపు శ్రీనివాస్‌  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్టీ నాయకులు గొర్రెల సూరిబాబు, వాకపల్లి కృష్ణ, పార్టీ మండల కన్వీనర్లు పెదపాటి డాక్టర్‌బాబు, ఉల్లి బుజ్జిబాబు, మండారపు వీర్రాజు, మల్లిన చౌదరి, సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండల పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు