రాష్ట్రంలో హిట్లర్‌కు మించిన పాలన

25 Jul, 2018 08:59 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు,  ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా

కడప కార్పొరేషన్‌:  రాష్ట్రంలో నియంత హిట్లర్‌కు మించిన పాలన సాగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం బంద్‌ చేస్తున్న వారిని పోలీసులతో అరెస్టులు, గృహనిర్భందాలు చేయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టులు చేశారని, లాఠీలతో కొట్టారని, మహిళలని చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే తమను అరెస్ట్‌ చేశారని, కార్యకర్తల వాహనాలను సీజ్‌ చేసి, రహదారులపై పోలీసులతో కవాతు నిర్వహించి భయానక వాతావరణం సృష్టించారని ధ్వజ మెత్తారు.

చంద్రబాబు కుటిల రాజకీయానికి ఈ  అక్రమ అరెస్టులే పరాకాష్ట అన్నారు. ప్రయణికులు లేకపోయినా బంద్‌ను విఫలం చేసేందుకు బలవంతంగా బస్సులు నడిపి  ప్రభుత్వమే ఆర్టీసీ నష్టాలకు కారణమయ్యిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం వల్ల బంద్‌ విజయవంతమైందన్నా రు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనే టీడీపీ, బీజేపీ రహస్య ఒప్పందాలు బహిర్గతమయ్యాయన్నారు. టీడీపీ మాకు ఇప్పటికీ మిత్రపక్షమేనని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారని, భవిష్యత్తులో కూడా కలిసే ముందుకు సాగుతామని కూడా చెప్పారని గుర్తు చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌ మాటలను ఏ ఒక్క టీడీపీ ఎంపీ కూడా ఖండించలేదన్నారు. హోదా కావాలని, రావాలనే ఆకాంక్ష చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు.  ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని చెప్పారని తెలిపారు.  ప్రత్యేక హోదా సంజీవనా, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూటర్న్‌ తీసుకొని హోదా కావాలంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ జగన్‌ సారథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అలుపెరుగని పోరాటాలు చేసిందని, విజయవాడ వేదికగా వైఎస్‌ జగన్‌ ఆమరణ నిరాహార దీక్ష చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 14 యువభేరిలు నిర్వహించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఆనాడు ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ మాట్లాడితే అది ముగిసిన అధ్యాయమంటూ అవహేళన చేసిన చంద్రబాబు, మంత్రులు అవే విషయాలను నేడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌చే  పార్లమెంటులో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. ప్రధాని ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పిన త ర్వాత కూడా టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్లకార్డులు ప్రదర్శించడంలో అర్థం లేదని, వెంటనే వారు  తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

జెండాలను, అజండాలను పక్కనబెట్టి ఉద్యమిస్తేనే హోదా సాధించుకోగలమని తెలిపారు.  సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, మైనార్టీ నగర అధ్యక్షుడు షఫీ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు త్యాగరాజు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు