పట్టుదలే ఆయుధం

2 Jan, 2018 10:12 IST|Sakshi

దూర విద్యతో ‘గురుకుల’ ఉద్యోగం సాధించిన కవిత

 పీజీటీలో జోన్‌ 7వ ర్యాంకు, టీజీటీ ఇంటర్వూ్యకు ఎంపిక

కొత్తగూడెం: కృషి, పట్టుదల ఉంటే వయస్సు, వివాహం, పిల్లలు ఇతరత్రా విజయానికి ఆటంకాలు కావని జిల్లాకు చెందిన ఓ మహిళ నిరూ పించింది. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పగడాలకవిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పదోతరగతి తర్వాత దూరవిద్యలోనే ఉన్నత విద్యను ఆమె అభ్యసించారు. ఇటీవల గురుకుల నోటిఫికేషన్‌లో పీజీటీ విభాగంలో జోనల్‌ స్థాయిలో మహిళల ఓపెన్‌ కేటగిరీలో 7వ ర్యాంకు, జనరల్‌ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. అంతేకాకుండా టీజీటీ విభాగంలోనూ 1:2 ఇంటర్వూ్యకు అర్హతను సాధించారు. 

దూర విద్యతో ఉన్నత విద్య... 
జిల్లాలోని అశ్వాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన పగడాల కవితకు పదో తరగతి పూర్తి చేయగానే వివాహమైంది. కవితకు చదువుపై ఉన్న ఆసక్తిని ఆమె భర్త తుక్కాని శ్రీనివాసరెడ్డి గుర్తించి ప్రోత్సహించారు. అతని సలహా లు, సూచనలతో దూర విద్యా విధానంలో బీఏ, ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. ఆ తర్వాత 2015 లో పాల్వంచలోని మదర్‌థెరిస్సా కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమె కష్టపడ్డారు.  

కోచింగ్‌ లేకుండానే... 
గరుకులాల్లో ఉద్యోగాన్ని సాధించేందుకు ఎలాంటి కోచింగ్‌ను కవిత తీసుకోలేదు. కేవ లం తన ఇంటి వద్దనే ఆమె సాధన చేసే వారు. డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతుండగానే గురుకుల టీచర్స్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో టీజీటీ, పీజీటీ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 102 మార్కులతో ప్రిలిమ్స్‌లో మెయిన్స్‌కు క్వాలీఫై అయ్యారు. అనంతరం మెయిన్స్‌లోనూ ఉత్తమ మార్కులను సాధించి పీజీటీ విభాగంలో మహిళల ఓపెన్‌ కేటగిరిలో 7వ ర్యాంకు, జనరల్‌లో 9వ ర్యాంకును సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. టీజీటీ విభాగంలోను 1:2 తో అర్హత సాధించారు.

భర్త మార్గదర్శకంలో.. 
నా భర్త శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో డిగ్రీ, పీజీ, బీఈడీను పూర్తి చేశాను. ఆయన మార్గదర్శకత్వంలోనే ఉద్యోగానికి అర్హత సాధించా ను. ఉద్యోగం సాధించాలన్న కసి, పట్టుదల ఉంటే మిగతావేమీ అడ్డుకావు. ప్రణాళిక, తగిన మెటీరియల్స్‌ తో సాధన చేయాలి. నా లక్ష్య సాధనలో భర్త, కుమారుడి సహాయ సహకారాలు మరువలేనివి. విద్యార్థుల్లో తెలుగుపై మమకారం, పట్టును పెంచేలా భోదన చేసేందుకు నా వంతు కృషి చేస్తా. 
–పగడాల కవిత

మరిన్ని వార్తలు