-

మరో మహా మాంద్యం..!

27 Jun, 2015 00:17 IST|Sakshi
మరో మహా మాంద్యం..!

లండన్ : ప్రపంచానికి మరో మహా మాంద్యం ముప్పు పొంచిఉందా? ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ నెమ్మదినెమ్మదిగా 1930లనాటి మహా మాంద్యం తరహా సమస్యల్లోకి జారిపోతోందని రాజన్ హెచ్చరించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఎల్‌బీఎస్)లో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. సెంట్రల్ బ్యాంకులు పోటాపోటీగా ప్రకటిస్తున్న సహాయ ప్యాకేజీలు, ఇతరత్రా పాలసీ సడలింపు చర్యల పట్ల చాన్నాళ్లుగా రాజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి పాలసీ చర్యలకు సెంట్రల్ బ్యాంకులన్నీ తగిన పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని కూడా ఆర్‌బీఐ గవర్నర్ సూచించారు. గతంలో 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్దిమంది ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఒకరు. అప్పట్లో ఆయన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ మహా మాంద్యంలోకి కూరుకుపోతున్నామంటూ రాజన్ హెచ్చరించడం గమనార్హం.

 సమస్య అందరిదీ...
 ప్రస్తుతం నెలకొన్న సమస్య ఒక్క అభివృద్ధి చెందిన దేశాలకో లేదంటే వర్ధమాన దేశాలకో పరిమితమైనది కాదని.. మొత్తం ప్రపంచమంతటికీ ఇది పాకిందని రాజన్ పేర్కొన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న సరళ పాలసీతో పోలిస్తే.. భారత్‌లో పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు. పెట్టుబడులను పెంచడం కోసం తాము(ఆర్‌బీఐ) వడ్డీరేట్ల తగ్గింపుపై మరింత దృష్టిపెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలో వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యాఖ్యలు, మార్కెట్ ప్రతిస్పందనలను తాను పట్టించుకోబోనని కూడా గవర్నర్ స్పష్టం చేశారు.
 
 ‘ప్రస్తుత సమస్యకు మెరుగైన పరిష్కారం కోసం  విధానాలకు సంబంధించిన నిబంధనలకు సరిదిద్దాల్సిందే. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులన్నీ తమ చర్యలకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించాల్సిన తరుణం వచ్చింది. అయితే, 1930లలో వృద్ధిని పెంచడం కోసం అనుసరించిన చర్యల కారణంగా ఎలాంటి ముప్పు వాటిల్లిందో(మహా మాంద్యం) ఇప్పుడు కూడా మనం అలాంటి సమస్యల్లోకి కూరుకుపోతున్నామనేదే నా ఆందోళనంతా.

సెంట్రల్ బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే... వాస్తవానికి ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తున్నట్లు కనబడటం లేదు. అసలు వృద్ధికి ఎలాంటి ఆస్కారం లేని సమయంలో ఎలాగోలా పెంచాలని చూస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకరి వృద్ధి మరొకరికి బదలీ అవుతోందని కూడా భావించవచ్చు. మహా మాంద్యం సమయంలోనూ ఇలాంటి పోటాపోటీ డీవేల్యుయేషన్ పరిస్థితులను ప్రపంచం చవిచూసింది’ అని రాజన్ కుండబద్దలుకొట్టారు.
 
 ఊహిస్తేనే వణుకు...
 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలోకి జారిపోయిన 1930ల నాటి పరిస్థితులను మహా మాంద్యంగా పేర్కొంటారు. 1929 అక్టోబర్ 29న(మంగళవారం) అమెరికాలో స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ఆరంభమైన ఈ మాంద్యం 30వ దశకం చివరివరకూ కొనసాగింది. దీనివల్ల అన్ని దేశాలూ విలవిల్లాడాయి. ఇప్పటివరకూ అత్యధిక కాలం పాటు కొనసాగిన తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా కూడా ఇదే నిలుస్తోంది. ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధి రేటు తొలి నాలుగేళ్లలో 15 శాతానికిపైగా క్షీణించింది.

అంతర్జాతీయ వాణిజ్యం మొత్తం సగానికిపైగానే పడిపోయింది. పన్ను ఆదాయాలు క్షీణించి.. కార్పొరేట్ల లాభాలు, వ్యక్తిగత ఆదాయాలు దిగజారడంతో పాటు నిరుద్యోగం తారస్థాయికి చేరడం వంటి తీవ్ర పరిణామాలను ఈ మహా మాంద్యంలో ప్రజలు చవిచూశారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై ఇవన్నీ ఘోరమైన ప్రభావాన్ని చూపాయి. అనేక దేశాలు కరువులతో అల్లాడిపోయాయి కూడా.

మరిన్ని వార్తలు