ప్రజాస్వామ్య పాఠశాల ‘ఎమర్జెన్సీ’ | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పాఠశాల ‘ఎమర్జెన్సీ’

Published Sat, Jun 27 2015 12:13 AM

ప్రజాస్వామ్య పాఠశాల ‘ఎమర్జెన్సీ’ - Sakshi

జాతిహితం
 
ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి నలభై ఏళ్లయిన సందర్భమిది. భారత ప్రజాస్వామ్యానికి ఆమె చాలా చెరుపు చేశారు, దేశాన్ని నిరంకుశాధికారపు కొస చివరి వరకు నెట్టారు. ఇది ఈ సమయంలో ఎవరూ కాదనలేనిది. అయినప్పటికీ ఆమె అనుద్దేశపూర్వకంగానే మన ప్రజా స్వామ్యాన్ని సుసంపన్నం చేశారు, నిజమైన రెండు ధ్రువాల రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు దోహదం చేశారు, ఒక కొత్త తరం రాజకీయవేత్తలను సృష్టించారు కూడా అని నేను వాదిస్తే ఏమంటారు?

ఇదేమీ విభేదించడం కోసమే విభేదించడం కాదు. కొన్ని ఆధారాలను పరిశీలించండి. వర్తమాన భారత రాజకీయాల్లో కొలువుదీరిన ఇలవేలు పులందరి పేర్లూ లేకున్నా పొడవాటి ఈ జాబితాను చూడండి. అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, రాజనాథ్‌సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, నితీష్‌కుమార్, రామ్‌విలాస్ పాశ్వాన్, సుశీల్ మోదీ, హెచ్‌డీ దేవెగౌడ, చరణ్‌సింగ్, ప్రకాశ్‌సింగ్ బాదల్ చివరికి సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్‌లు కూడా. వీరందరి మధ్యా ఉన్న రెండు సామాన్య అంశాలు ఏవి?

ఒకటి... వీరంతా 1977 నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లోనూ, పలువురు ప్రభుత్వాల్లోనూ అత్యున్నత స్థానాలను అలంకరించినవారే. రెండు... వారందరూ అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ జైళ్లలోకి నెట్టిన వారే. అందులో చాలా మంది మొత్తం 19 మాసాలూ జైళ్లలోనే మగ్గగా, కారత్ వంటి వారు చాలా కొద్ది కాలమే జైల్లో ఉన్నా అజ్ఞాత కార్యకలాపాలను సాగించినవారు. అనుద్దేశపూర్వకంగానే అయినా ఇందిరాగాంధీ నిస్సందే హంగా మన ప్రజాస్వామ్యానికి మొత్తంగా ఒక కొత్త రాజకీయ ధీశాలుల తరాన్ని అందించారు. అజేయమైన ఆమె పార్టీని ఆ తరమే చివరికి లోక్‌సభ లో 44 స్థానాలకు కుదించివేసింది. కాంగ్రెస్ అధికారాన్ని చిన్న రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లు మినహా  కేవలం మూడు ప్రధాన రాష్ట్రాలకు, రెండు అర్ధ ప్రధాన రాష్ట్రాలకు (కర్ణాటక, కేరళ, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్) పరిమితమయ్యేట్టు చేసింది.

నేను చెప్పేది మీకు సబబు కాద నిపించవచ్చేమోగానీ ఈ విషయాన్ని మీరు కాదనలేరు. మొత్తం ప్రతిపక్షాలనన్నిటినీ తుడిచిపెట్టేయాలనే ప్రయ త్నంలో ఇందిర నిజంగానే అఖిల భారత స్వభావంగలిగిన, సకల భావజా లాలకు చెందిన విశ్వసనీయ నూతన నాయక శ్రేణులను సృష్టించారు. వారి ప్రతిభాపాటవాలను, ఆకర్షణను ఎదుర్కోవడంలో ఆమె వారసులు నానా టికీ ఎక్కువగా విఫలమయ్యారు. అత్యవసర పరిస్థితే లేకుంటే, బహుశా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలో ఉండేదే కాదని, ఆర్‌ఎస్‌ఎస్ ఇంత ప్రాముఖ్యంగల భావజాల శక్తిగా ఉండేది కాదని నేను ధీమాగా చెప్పగలను. అలాగే ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు ఏదో ఒక రకం లోహియావాద సోషలిస్టులు అధిపతులై ఉండేవారు కూడా కాదు. ఈ వాదన మరోసారి సుదీర్ఘంగా చర్చించాల్సినది. ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్ర పోరాటానికి చాలా వరకు దూరంగా ఉండిపోయింది. అది మొదటిసారిగా పాల్గొన్న ఈ  ప్రజాపోరాటం ద్వారానే జాతీయస్థాయి గౌరవాన్ని సంపాదిం చుకోగలిగింది.

మీరిక ఆ తదుపరి స్థాయి అన్వేషణకు పోవచ్చు. నవీన్ పట్నాయక్ ఒడిశాకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇంకా అజేయులుగానే కని పిస్తున్నారు. ఆయన తండ్రి బిజూ పట్నాయక్ అత్యవసర పరిస్థితిలో జైల్లో ఉన్నారు. కర్ణాటకలోని యడ్యూరప్ప కూడా 1975-77 మధ్య జైళ్లలో మగ్గిన వర్గం నుంచే వచ్చారు. రాజస్థాన్‌లోని వసుంధరా రాజే వ్యక్తిగత వివరాలను గమనిస్తే అందులో ప్రముఖంగా కనిపించేది ఆమె తల్లి విజయ రాజే సింథియానే.

ఆమె సైతం ఆ కాలంలో జైలుకు వెళ్లారు. సుష్మాస్వరాజ్ జైలు కు వెళ్లలేదు. కానీ భర్త స్వరాజ్ కుశాల్‌తో కలసి జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించిన యువ న్యాయవాదిగా పేరు మోశారు. నానీ పాల్కీ వాలా నేతృ త్వంలో 200 మంది లాయర్ల సేన చేసిన కృషి విఫలంకాగా, చివరికి రామ్‌జెఠ్మలానీకి వ్యతిరేకంగా అరెస్టు వారంటు జారీ అయ్యింది. అయితే ఆయన కెనడాకు తప్పించుకుపోయి, అక్కడే ప్రవాసంలో గడిపారు. సుబ్రహ్మణ్యం స్వామి సైతం మరింత నాటకీయ పరిస్థితుల్లో అదే పని చేశారు.
 మోదీ మంత్రివర్గాన్ని మరింత లోతుగా తరచి చూస్తే అందులో డెభ్భైల మధ్యలో యువకులుగా ఉన్నవారిలో దాదాపు ప్రతి ఒక్కరూ... అనంత కుమార్ నుంచి కల్‌రాజ్‌మిశ్రా వరకు అలా జైల్లో ఉన్న వర్గానికి చెందినవారే.

మరింత లోతుగా శోధిస్తే ఈ వ్యవహారం హాస్యాస్పదంగా మారడం కూడా మొదలవుతుంది. నేడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా జైలుకు వెళ్లినవారే. అలాగే గుజరాత్‌లో శంకర్‌సింహ్ వాఘేలా కూడా. ఈ ఇద్దరూ ‘‘తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బాపతు’’ అయినా వారూ ఎమర్జెన్సీ శిశువులనే వాస్తవం చెక్కుచెదరదని. కాబట్టి అత్యవసర పరిస్థితిని ప్రజాస్వామ్యీకరణ విశ్వ విద్యాలయంగా పిలవడం అవాస్తవమూ కాదు, హాస్యాస్పదమూ కాదు.

నూతనమైన, పరివర్తన చెందుతున్న ప్రజాస్వామ్యాల్లో ప్రజా ఉద్య మాలు, పోరాటాలలోంచే నాయకత్వం ఆవిర్భవిస్తుంది. మొట్టమొదటి సారిగా, చాలా కాలం రాజకీయాల్లో మనగలిగిన వారిగా పోతపోసిన నాయకులు ఎక్కువగా స్వాతంత్య్రోద్యమంలోంచే తయారయ్యారు అనేది స్పష్టమే. విభిన్న ఆలోచనలను ఒకే  ఛత్రఛాయ కిందకు తెచ్చిన విశాలమైన సంస్థగా కాంగ్రెస్, గాంధీజీ నేతృత్వంలో వామపక్షం నుండి మితవాదం వరకు అంతా తమ భావజాలపరమైన విభేదాలను మరచి లేదా కనీసం తాత్కాలికంగా వదిలి ఒకే లక్ష్యం కోసం పోరాడేట్టు చేసింది.

స్వాతంత్య్రా నంతర కాలంలో ఆ ఐక్యత కొంత ఛిన్నాభిన్నమైనా, అధికులు కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. విడిపోయినవారు ప్రతిపక్షాలను నిర్మించడం కోసం కృషి చేసినా, అవేవీ కాంగ్రెస్‌కు సాటి రాలేదు. వాటి మధ్య ఐక్యత కోసమూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. వాటిలో చెప్పుకోదగినది ‘సంయుక్త విధాయక్ దళ్’. అది 1967లో కాంగ్రెస్‌ను ఒక్క కుదుపు కుదిపినా ఓడించ లేకపోయింది. ఎమర్జెన్సీ వరకు అందుకోసం ఆగాల్సి వచ్చింది. స్వాతంత్య్ర భారతంలోని మొట్టమొదటి జాతీయ పోరాటానికి ఎమర్జెన్సీ వ్యతిరేకత వేదికైంది.

ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నాలు విఫలం కావడంతో... తరువాతి కాలంలో ఎన్నికల సర్వేల నిపుణులు అభివర్ణించినట్టు ఐఓయూ (ప్రతిపక్ష ఐక్యతా సూచిక) తక్కువగా ఉండటంతో టీఎన్‌ఏ (ప్రత్యా మ్నాయం లేదు) అనే అనుకూలత కాంగ్రెస్‌కు శాశ్వత కానుకైంది. నాడు క్యాడర్ల ప్రాతిపదికపై నిర్మితమైన అతిపెద్ద పార్టీ జనసంఘ్. దీంతో సోషలిస్టులు, లోహియావాదులు, ఉదారవాదులు, పచ్చి మితవాద పక్షానికి ప్రాతినిధ్యం వహించిన స్వతంత్ర పార్టీ, బెంగాల్ , కేరళలకు, కొంతవరకు ఆంధ్రా, పంజాబ్, మహారాష్ట్రలకు  పరిమితమైన కమ్యూని స్టులకు దానికి మధ్య భావజాలపరమైన ఐక్యత సాధ్యం కాలేదు.

భావజాలపరమైన సామాన్య అంతస్సూత్రం లోపించడంతో, అవి ‘‘వంశపారంపర్య’’ పాలన, ‘‘వ్యక్తిపూజ’’, ‘‘ఆధిపత్యవాద రాజకీ యాల’’కు వ్యతిరేకంగా వివిధ రకాలుగా ఐక్యత కోసం ప్రయత్నిం చాయి. కానీ అవి తమను కలిపి ఉంచగలుగుతాయని అటు వారి నాయకులకు, ఇటు ఓటర్లకు సైతం నమ్మకం కలిగించలేక పోయాయి. దీంతో వాటిని ‘‘దీనురాలు’’ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అవకాశ వాదంతో ఎక్కుపెట్టిన కూటములుగానే అంతా చూశారు. ‘‘వాళ్లు ఇందిరను నిర్మూలిద్దాం అటున్నారు, ఇందిర పేదరికాన్ని నిర్మూలిద్దాం అంటోంది. ఏది మంచో  మీరే నిర్ణయించుకోండి’’ అనే తన నినాదంతో ఇందిరాగాంధీ ఈ సెంటిమెంటును  బ్రహ్మాస్త్రంగా వాడుకున్నారు.  

ఎమర్జెన్సీ ఈ పరిస్థితిని మూడు విధాలుగా మార్చింది. ఒకటి... అంతవరకు ఇందిరాగాంధీలోని ప్రతికూలాత్మక అంశాలుగా వేలెత్తి చూపుతున్న ఆధిపత్యవాదం, వ్యక్తి పూజ, వంశపారంపర్య పాలన (గువాహటిలో 1976 డిసెంబర్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో ఇందిర వారసునిగా సంజయ్‌గాంధీకి పట్టాభిషేకం జరిగింది) వంటివన్నీ ఇప్పుడు నమ్మశక్యమైనవిగా అనిపించసాగాయి. రెండు... అది వేలాది మంది రాజకీయ నేతలు, కార్యకర్తలకు పోరాటం, త్యాగం, సాహసం వంటి లక్షణాలున్నవారిగా కీర్తిని ఆర్జించిపెట్టాయి. ప్రత్యేకించి వారి రాజకీయ మార్కుల పత్రంలోని అత్యంత ముఖ్యమైన గడి అయిన రాజకీయ ఖైదీగా జైలు శిక్షను అనుభవించడంలో ప్లస్ గుర్తు లభించింది. అది అంతవరకు స్వాతంత్య్ర పోరాట యోధులకు మాత్రమే పరిమితమైనది.

వారిలో చాలా వరకు కాంగ్రెస్‌వారే. ఫలితంగా లాలూ, ములాయం, నితీష్, శరద్ యాదవ్ చివరికి ఏచూరి, కారత్‌ల వంటి పలువురు విద్యార్థి కార్యకర్తలు నాయకులుగా ఎదిగారు. మూడు... జైళ్లలో వీరంతా కలసి ఆలోచనలను కలబోసుకుంటూనో, కలసిమెలసి భోజనం చేస్తూనో, కబుర్లు చెప్పుకుం టూనో లేదా బ్యాడ్మింటనో, వాలీబాలో ఆడుతూ ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవడం, వ్యక్తిగత స్నేహాలను పెంపొందించు కోవడం తప్పని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితిని మనం ప్రజాస్వామ్యీకరణ విశ్వ విద్యాలయం అనేట్టయితే, ఇందిరాగాంధీ జైళ్లు ఆమె ప్రత్యర్థులకు అత్యంత ప్రభావశీలమైన సైనిక శిక్షణా శిబిరాలే అయ్యాయి.

ఈ అగ్నిపరీక్షే లేకుంటే భారత రాజకీయాలు ఎలా ఉండేవో ఊహించడం పాత్రికేయులమైన మా పని కాదు. కానీ, రాజకీయ కాల్పనిక సాహిత్య రచయితలకు మాత్రం అది గొప్ప కథా వస్తువు అవుతుంది. అత్యవసర పరిస్థితి తదనంతర కాలంలోనూ మనం కొన్ని గణనీయమైన గొప్ప ప్రజా ఉద్యమాలను చూశాం. వాటిలో చెప్పుకోదగినవి మందిర్, మండల్ ఉద్యమాలు. వీటిలో మొదటిది ఉమాభారతి నుంచి వినయ్ కతియార్ వరకు తరతమ స్థాయిల్లో ప్రాముఖ్యతగలిగిన కొందరు నేతలను తయారు చేసింది. కల్యాణ్‌సింగ్ అత్యవసర పరిస్థితి కాలపు ఖైదీ కాబట్టి ఆయన్ను నేనీ జాబితాలో చేర్చడం లేదు. ఇక మండల్ ఉద్యమం మరింత మంది నేతలను సృష్టించింది.

వాస్తవానికి వీపీ సింగ్‌తో ప్రారంభించి,  ముగ్గురు యాదవ్‌లైన ములాయం, లాలూ, శరద్‌లకు అత్యున్నతస్థాయిలో అవకాశాన్ని సృష్టించింది. ఆ తదుపరి ప్రజావెల్లువ కోసం మనం రెండు దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది. అది అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం. అయితే అది కేవలం ఒక్క చెప్పుకోదగిన నేతను, ఇద్దరు గౌరవనీయులైన అసమ్మతివాదులను, కొందరు ఎప్పుడూ టీవీ కెమెరాల ముందు ప్రాధేయపడుతూ కనిపించే బాపతు నేతలను మాత్రమే మనకు ఇచ్చినట్టుంది.

మన ప్రజాస్వామ్యానికి ఇందిరాగాంధీ చేసిన దోహదాన్ని ఇది సరియైన దృష్టి కోణంలో చూపిస్తుంది. ఆమె జైలుకు పంపిన వారిలో దాదాపు అంతా అత్యున్నత స్థానాలకు ఎదిగారు. ఆమె నిర్బంధించిన తన సొంత పార్టీకే చెందిన ‘‘యంగ్ టర్క్’’ అసమ్మతివాదులు చంద్రశేఖర్ (ప్రధాని), కృష్ణకాంత్ (ఉప రాష్ట్రపతి), మోహన్ ధారియా, రామ్‌ధన్‌లు (కేబినెట్   మంత్రులు) కూడా ఉన్నతస్థానాలకు చేరారు. వీపీ సింగ్‌గాక 1997 తర్వాతి కాంగ్రెసేతర ప్రధానులంతా అత్యవసర పరిస్థితి బాధితుల వర్గానికి చెందినవారే: మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, చంద్రశేఖర్, వాజపేయి, దేవెగౌడ జైలు పాలైనవారే.

పత్రికలపై ఆంక్షలపై విభేదించడంతో ఐకే గుజ్రాల్ సైతం సమాచార, ప్రసార శాఖ మంత్రి పదవిని కోల్పోయారు. కాబట్టి మీరు ఏ దృష్టితో చూస్తారనేదాన్నిబట్టి ఆయన కూడా అత్యవసర పరిస్థితి బాధితులు లేదా లబ్ధిదారు. ఇక మిగిలేది నరేంద్రమోదీయే. అయితే ఒక్క క్షణం ఆగండి. నా స్నేహితురాలు, సహోద్యోగి కూమీ కపూర్ రాసిన ‘‘ది ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ’’ అనే అద్భుతమైన పుస్తకం ఆ విషయాన్ని చెబుతుంది. సుబ్రహ్మణ్యం స్వామి (ఆయన ఆమె సోదరికి భర్త) అరెస్టును తప్పించుకు తిరుగుతూ, సిక్కు వేషంలో గుజరాత్ మంత్రి మార్కండ్ దేశాయ్‌ని కలుసుకోవడానికి వెళ్లారు. అప్పుడాయనను సురక్షితంగా రైల్వే స్టేషన్ నుంచి తీసుకురావడం కోసం ఒక యువ స్వయంసేవక్‌ను పంపారు. మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు. అది మరెవరో కాదు యువ నరేంద్రమోదీ. ఇలా ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి అగ్నికీలల్లోంచి మరో ప్రధాని రాజకీయ రంగంపైకి వచ్చారు.   

తాజా కలం: అత్యవసర పరిస్థితికి సంబంధించిన నా వ్యక్తిగత చరిత్ర ఏమంత చెప్పుకోదగిందేం కాదు. అప్పట్లో చండీగఢ్ అంటే మారుమూల ప్రాంతం. నేనాకాలంలో అక్కడి క్యాంపస్‌లో జర్నలిజం విద్యార్థిగా ఉన్నాను. అయినా నాకూ చెప్పడానికి ఓ కథ ఉంది. రోహతక్, జాట్ ప్రాంతానికి గుండెకాయ లాంటిది. నా తల్లిదండ్రులు అప్పట్లో అక్కడే నివసించేవారు. 1975 స్వాతంత్య్ర దినోత్సవంనాడు, అప్పటికే రక్షణ మంత్రిగా పదోన్నతిని పొందిన బన్సీలాల్ అక్కడి పరేడ్‌లో ఇచ్చిన సందేశంలో మూడు గుర్తుంచుకోదగిన అంశాలున్నాయి. ఒకటి, వార్తా పత్రికలు ఎంత విషపూరితమైనవంటే, వాటిని ఎవరూ పకోడీలను పొట్లం కట్టుకోడానికి కూడా వాడరాదు.

రెండు, మబ్బులు నిండిన ఆకాశం వైపు చూస్తూ ఆయన... ఇంత అద్భుతమైన వర్ష రుతువును 1947లో ‘‘పాపులు’’ అందరినీ పాకిస్తాన్‌కు పంపేసినప్పుడు చూశాం, ఇంకా మిగిలిన వారిని కూడా జైళ్లలో బంధించాక ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. ఇక మూడవది, జుల్ఫీకర్ ఆలీ భుట్టోతో కలసి ఇందిరాగాంధీ సిమ్లా ఒప్పందంపై సంతకం ఎందుకు చేశారనే విషయంపై నూతన రక్షణమంత్రిగా ఆయన తమ బుద్ధి సూక్ష్మతను ప్రసరింపజేసిన ఫలితం. సిమ్లా చర్చల్లో భుట్టో ఆమె కాళ్లపై పడి దయ చూపమని అర్థించారు. చివరకు ఆయన లేచి నిలిచేటప్పటికి భుట్టో ప్యాంటు తడిసిపోయి ఉండటాన్ని గమనించిన ఇందిర ఆయనపై జాలిపడ్డారు.

సిమ్లా ఒప్పందంపై సంతకం చేసి, 93,000 మంది యుద్ధ ఖైదీలను వదిలి పెట్టేశారు. వీటిలో మొదటి వ్యాఖ్య దివ్యంగా ఉంది. పాత్రికేయులను ఆయన విషక్రిములనో లేదా బొద్ద్దింకలనో కూడా అని ఉండాల్సింది. ఇక రెండవ వ్యాఖ్య అభ్యంతరకరమైనదే అయినా, ఆ రోజుల్లో అది ఆమోదయోగ్యమే. కానీ మూడవది మాత్రం దౌత్యపరంగా ఇబ్బంది కరమైన పర్యవసానాలకు దారితీసేది. నియంత ఇందిరకు సైతం అది ఆమోదయోగ్యం కానిది. సిమ్లా, భుట్టోలపై బన్సీలాల్ చేసిన వ్యాఖ్యలను తొలగించాలని అన్ని వార్తాపత్రికలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఇది సెన్సార్‌షిప్ మూర్ఖత్వానికి తారస్థాయి అవుతుంది. తమ సొంత రక్షణమంత్రి వ్యాఖ్యలనే ప్రభుత్వం సెన్సార్ చేసుకునే స్థితికి చేరింది.
 

 - శేఖర్ గుప్తా
shekhargupta653@gmail.com

Advertisement
Advertisement