బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఫలితాలు ఆకర్షణీయం

17 May, 2019 05:38 IST|Sakshi

క్యూ4 లాభం రూ.839 కోట్లు

న్యూఢిల్లీ: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. లాభం 32 శాతం పెరిగి రూ.839 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా 44 శాతం వృద్ధితో 12,995 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.637 కోట్లు, ఆదాయం రూ.9,055 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో అన్ని అంశాల్లోనూ మంచి వృద్ధి నమోదైనట్టు, అనుబంధ కంపెనీ బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 57 శాతం పెరిగిందని బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఈవో ఎస్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.42,606 కోట్ల ఆదాయంపై రూ.3,219 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.32,863 కోట్లు, నికర లాభం రూ.2,650 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.  

జనరల్‌ ఇన్సూరెన్స్‌
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అనుబంధ బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లాభం మాత్రం అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.187 కోట్ల నుంచి రూ.83 కోట్లకు క్షీణించింది. అంటర్‌రైటింగ్‌ నష్టాలు ఎక్కువగా ఉండడం, పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.20 కోట్లను కేటాయించడం లాభం తగ్గడానికి కారణమని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియం ఆదాయం 23 శాతం వృద్ధితో 3,402 కోట్లకు చేరింది. క్లెయిమ్‌ రేషియో 75.5 శాతంగా ఉంది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం తగ్గి రూ.780 కోట్లకు పరిమితమైంది.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌
మరో అనుబంధ కంపెనీ బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నికర లాభం మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.171 కోట్ల నుంచి రూ.112 కోట్లకు తగ్గింది.  

బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 50% అప్‌
ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌    
బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్‌లో 50 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.743 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,114 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,425 కోట్ల నుంచి రూ.4,888 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 6 డివిడెండ్‌ (300 శాతం) ఇవ్వనున్నామని తెలిపింది.

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.2,485 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,890 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 1.54 శాతంగా, నికర మొండి బకాయిలు 0.63 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్‌ లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 3.6 శాతం లాభంతో రూ.3,112 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు