కార్ల ధరలు పెరిగాయ్

7 Jan, 2015 01:15 IST|Sakshi
కార్ల ధరలు పెరిగాయ్

ఎక్సైజ్ సుంకం పెంపు ఫలితం
ఉత్పత్తి వ్యయాలు పెరగడమూ మరో కారణం

 
 
ముంబై: ఇటీవల ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో వాహన కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి. జనరల్ మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియాలు మంగళవారం ధరలను పెంపును ప్రకటించగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, బజాజ్ ఆటో  కంపెనీలు కూడా త్వరలో పెంచనున్నాయి.  షెవర్లే వాహనాల ధరలను మోడళ్లను బట్టి రూ.15,000 నుంచి రూ.61,000 వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది.  హోండా కార్స్ ఇండియా కంపెనీ తన కార్ల (హోండా సిటీ, అమేజ్ తదితర మోడళ్లు) ధరలను రూ 60,000 వరకూ పెంచింది.

మారుతీ పెంపు రూ.31,600 వరకూ

మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరలను రూ.7,850 నుంచి రూ.31,600 వరకూ పెంచింది. ఓమ్ని ధరలు రూ.7.850 నుంచి రూ.9,950 వరకూ, ఆల్టో ధరలు రూ.8,500 నుంచి రూ.12,700 వరకూ, వ్యాగన్‌ఆర్ ధరలు రూ.12,500 నుంచి రూ.15,700 వరకూ, స్విఫ్ట్ ధరలు రూ.15,850 నుంచి రూ.25,150 వరకూ, డిజైర్ ధరలు రూ.17,500 నుంచి రూ.26,650 వరకూ, సెలెరియో ధరలు రూ.13,600 నుంచి రూ.17,200 వరకూ, ఎర్టిగ ధరలు రూ.18,750 నుంచి రూ.27,750 వరకూ,  సియాజ్ ధరలు రూ.22,450 నుంచి రూ.31,600 వరకూ పెరుగుతాయని పేర్కొంది.

హ్యుందాయ్ పెంపు రూ.1.27 లక్షల వరకూ

హ్యుందాయ్ మోటార్ వాహనాల ధరలను రూ.15,000 నుంచి రూ.1,27,000 వరకూ పెంచింది. ఎంట్రీ లెవల్ కారు ఈఆన్ ధరలను రూ.15,417, ఐ10 ధరలను రూ.21,501, గ్రాండ్ ఐ10 ధరలను రూ.22,508 వరకూ పెంచింది. కాంపాక్ట్‌సెడాన్ ఎక్సెంట్ ధరలను రూ.25,597, ప్రీమియం హ్యాచ్‌బాక్ ఇలీట్ ఐ20 ధరలను రూ.29,814, మిడ్ సైజ్ సెడాన్ వెర్నా ధరలను రూ.23,965, ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఎలంత్ర ధరలను రూ.36,912, సొనాట ధరను రూ.45,396, శాంటాఫై ధరలను రూ.1.27 లక్షలకు పెంచింది. సుంకం పెంపు కారణంగా టూవీలర్ల ధరలను 2,000-7,000 రేంజ్‌లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ధరలను పెంచిందని సమాచారం.
 
ఈ నెల 1 నుంచి తయారైన వాహనాలకే పెరిగిన ఎక్సైజ్ రేట్లు వర్తిస్తాయి కాబట్టి గత ఏడాది తయారైన కార్లకు ఎక్సైజ్ సుంకం పెంపు వర్తించదు. అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా కంపెనీలు/డీలర్లు పాత ధరలకే ఈ వాహనాలను ఆఫర్ చేయవచ్చని నిపుణులంటున్నారు.

మరిన్ని వార్తలు