కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బొనాంజ

18 Jul, 2018 10:39 IST|Sakshi
బేస్‌ ఇయర్‌ 2016తో కొత్త సీపీఐ-ఐడబ్ల్యూ..

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్‌ బొనాంజ పొందబోతున్నారు. వేతన కమిషన్‌ బొనాంజతో ఇప్పటికే 2 శాతం పెరిగిన డియర్నెస్ అలవెన్స్‌(డీఏ), మరో విడత వేతన పెంపు ఉండబోతుందని తెలుస్తోంది. డీఏను గణించడానికి ఇండెక్స్‌ను, బేస్‌ ఇయర్‌ను ప్రభుత్వ సవరించబోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి వేతనం పెరగబోతుందని తెలుస్తోంది.

కార్మికుల డీఏను నిర్ణయించడానికి ... ఇండస్ట్రియల్‌ వర్కర్ల కోసం కొత్త సిరీస్‌ వినియోగదారుల ధరల సూచీపై కార్మిక మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీవన సర్దుబాటు భత్యం ఖర్చు కింద డీఏను చెల్లిస్తారు. బేస్‌ ఇయర్‌ 2016తో కొత్త సీపీఐ-ఐడబ్ల్యూను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే లేబర్‌ బ్యూరో ఖరారు చేసిందని ప్రభుత్వ రంగ సీనియర్‌ అధికారి చెప్పారు. జీవన ఖర్చులు మారుతుండటంతో, ప్రతి ఆరేళ్లకు ఒక్కసారి ఈ బేస్‌ను కూడా మార్చాలని ప్రతిపాదించామని తెలిపారు. ప్రస్తుతమున్న సీపీఐ-ఐడబ్ల్యూ 2001 బేస్‌ ఇయర్‌ అని పేర్కొన్నారు. 

బేస్‌ ఇయర్‌ను మార్చడంతో, ప్రస్తుతం 1.1 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. గతంలో 2006లో బేస్‌ ఇయర్‌ను మార్చారు. కాగ, 7వ వేతన కమిషన్‌ ప్రతిపాదనల మేరకు మార్చిలోనే కేంద్ర కేబినెట్‌ డీఏను 5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఈ పెంచిన డీఏ 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు.    

మరిన్ని వార్తలు