ముకేశ్‌ వేతనం 12వ ఏడాదీ రూ. 15 కోట్లే..

24 Jun, 2020 10:29 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వరుసగా 12వ ఏడాది కూడా జీతభత్యాల కింద రూ. 15 కోట్లే తీసుకున్నారు. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో వ్యాపారాలు గాడిన పడేంత వరకూ ఈ ఏడాది .. పూర్తి వేతనాన్ని వదులుకోనున్నారు. సంస్థ తాజా వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2008–09 ఆర్థిక సంక్షోభ కాలం నుంచి ముకేశ్‌ అంబానీ తన జీతభత్యాలపై స్వయంగా నియంత్రణ విధించుకున్నారు. (ముఖేష్‌ అంబానీని ముందుండి నడిపించినా..)

మరింత అధికంగా పొందే అవకాశాలు ఉన్నా.. అప్పట్నుంచీ రూ. 15 కోట్ల జీతభత్యాలకే పరిమితమయ్యారు. 2019–20లో అంబానీ రూ. 4.36 కోట్లు వేతనం, అలవెన్సుల కింద, కమీషను రూపంలో రూ. 9.53 కోట్లు, రిటైర్మెంట్‌ ప్రయోజనాల కింద రూ. 71 లక్షలు అందుకున్నారు. మరోవైపు, బోర్డులోని ఆయన కుటుంబ సభ్యులు నిఖిల్‌ మేస్వాని, హితల్‌ మేస్వానిల జీతభత్యాలు రూ. 20.57 కోట్ల నుంచి రూ. 24 కోట్లకు పెరిగింది. అటు కీలక ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌ జీతభత్యాలు రూ. 10.01 కోట్ల నుంచి రూ. 11.15 కోట్లకు చేరింది.

దేశీయ కుబేరుడు అంబానీయే 
భారతీయ కుబేరుడిగా ముకేశ్‌ అంబానీ హరూన్‌ జాబితాలో కొనసాగారు. ఈ ఏడాది మార్కెట్ల పతనంలో రిలయన్స్‌ అధినేత సంపద తొలి 2 నెలల్లో (ఫిబ్రవరి–మార్చి) 19 బిలియన్‌ డాలర్లు (రూ.1.42 లక్షల కోట్లు) పడిపోయినా కానీ.. తర్వాతి రెండు నెలల్లో (ఏప్రిల్‌–మే) 18 బిలియన్‌ డాలర్లు (రూ.1.35 లక్షల కోట్లు) కోలుకుందని ఈ నివేదిక ప్రస్తావించింది.  2020 మే చివరికి ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ 8వ స్థానానికి చేరినట్టు పేర్కొంది. టాప్‌–100 ప్రపంచ సంపన్నుల్లో హెచ్‌సీఎల్‌కు చెందిన శివ్‌నాడార్‌ రూ.1.2 లక్షల కోట్లు (16 శాతం తగ్గుదల), గౌతం అదానీ రూ.1.05 లక్షల కోట్లతో (18 శాతం తగ్గుదల) చోటు దక్కించుకున్నారు. (ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్..)

>
మరిన్ని వార్తలు