డీమార్ట్‌కు కోవిడ్‌-19 షాక్‌

11 Jul, 2020 16:10 IST|Sakshi

క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు

88 శాతం పడిపోయిన నికర లాభం

మొత్తం ఆదాయం 33 శాతం డౌన్‌

శుక్రవారం రూ. 2330 వద్ద నిలిచిన షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో డీమార్ట్‌ నికర లాభం ఏకంగా 88 శాతం పడిపోయింది. రూ. 40 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 323 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 33 శాతంపైగా వెనడుగుతో రూ. 3,883 కోట్లను తాకింది. కోవిడ్‌-19 కట్టడికి ప్రభుత్వం లాక్‌డవున్‌ అమలు చేయడం, డిమాండ్‌ క్షీణించడం వంటి అంశాలు పనితీరును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  మార్జిన్లు 4.5 శాతం  క్షీణించి 1 శాతానికి చేరాయి. గత క్యూ1లో ఇవి 5.5 శాతంగా నమోదయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం ఈ షేరు 0.5 శాతం బలపడి రూ. 2330 వద్ద ముగిసింది.

80 శాతం రికవరీ
వైరస్‌ విస్తృతి, లాక్‌డవున్‌ కారణంగా క్యూ1లో అమ్మకాలు నీరసించినప్పటికీ తిరిగి డిమాండ్‌ రికవరీ బాట పట్టినట్లు డీమార్ట్‌ పేర్కొంది. లాక్‌డవున్‌ నియంత్రణల ఎత్తివేత తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్‌ ముందు నమోదైన అమ్మకాల్లో  80 శాతానికి చేరువైనట్లు తెలియజేసింది. అయితే స్టోర్లను అనుమతిస్తున్న సమయం, ఇతర ఆంక్షల కారణంగా నిత్యావసరాల విక్రయాలు మాత్రమే జోరందుకున్నట్లు వివరించింది. ఇతర (నాన్‌ఎఫ్‌ఎంసీజీ) ప్రొడక్టులకు డిమాండ్‌ తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఇకపై కంపెనీ పనితీరుపై అనిశ్చితి ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు