ఈ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం వచ్చినట్లే.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న జాబ్స్‌ ఇవే!

22 Nov, 2023 09:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉంటున్నప్పటికీ కొన్ని విభాగాల్లో నిపుణులకు మాత్రం డిమాండ్‌ మెరుగ్గానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌), ఆటోమోటివ్‌ డిజైన్, టెస్టింగ్, ఆడ్మినిస్ట్రే షన్‌ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్‌ నెలకొన్నట్లు బిజినెస్‌ సొల్యూషన్స్‌ సేవల సంస్థ క్వెస్‌ కార్ప్‌ ఒక నివేదికలో తెలిపింది.

‘ఈమధ్య కాలంలో తొలిసారిగా పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీల్లో సిబ్బంది సంఖ్య, గైడెన్స్‌ తగ్గింది. ఇది, రాబోయే రోజుల్లో ఆచి తూచి అడుగులు వేయాలని పరిశ్రమ సమిష్టిగా నిర్ణయించుకున్నట్లు సూచిస్తోంది. మళ్లీ పరిస్థితి మెరుగుపడే వరకు ఒకట్రెండు త్రైమాసికాల పాటు ఈ అనిశ్చితి కొనసాగుతుందని భావిస్తున్నాం‘ అని క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ సీఈవో విజయ్‌ శివరామ్‌ చెప్పారు.  

నైపుణ్యాలను పెంచుకుంటే బోలెడు అవకాశాలు.. 
కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ విధానాలను మార్చుకుంటున్నాయని, వచ్చే రెండేళ్లలో కృత్రిమ మేథ (ఏఐ)పై ఇన్వెస్ట్‌ చేయాలని 85 శాతం పైగా భారతీయ సంస్థలు భావిస్తున్నాయని విజయ్‌ శివరామ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఇన్వెస్ట్‌ చేసే వారికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందుతోందని, జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో దేశీ ఐటీ రంగానికి మరిన్ని కొత్త సాంకేతికతలు తోడయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ తమ కార్యకలాపాల్లో భాగంగా గమనించిన డిమాండ్, సరఫరా గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఈఆర్‌పీ, ఆటోమోటివ్‌ డిజైన్, టెస్టింగ్, డెవలప్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌ అనే 5 నైపుణ్యాలకు .. నియామకాలకు సంబంధించిన మొత్తం డిమాండ్‌లో 65 శాతం వాటా ఉంది. వీటితో పాటు జెన్‌ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్, ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్‌ స్పెషలైజేషన్‌ మొదలైన నైపుణ్యాలు ఉన్న వారికి కూడా డిమాండ్‌ నెలకొంది. 

టెక్నాలజీ హబ్‌గా పేరొందిన బెంగళూరును దాటి ఐటీ రంగం ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. వర్ధమాన టెక్‌ హబ్‌లైన హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబై, చెన్నై, ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) కూడా గణనీయంగా ఎదుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో టెక్నాలజీ సంబంధ పరిశ్రమలు వృద్ధి చెందుతుండటం, దేశ విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి.  

మరిన్ని వార్తలు