జీఎస్టీతో ఈ-కామర్స్ కన్జ్యూమర్లు డోంట్ వర్రీ

20 May, 2017 10:19 IST|Sakshi
జీఎస్టీతో ఈ-కామర్స్ కన్జ్యూమర్లు డోంట్ వర్రీ
న్యూఢిల్లీ : ప్రస్తుతం సగం పైగా కొనుగోళ్లు ఈ-కామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ల ద్వారానే జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో జీఎస్టీ అమలుకు సన్నద్ధమవుతుండటంతో, ఈ ప్రభావం ఈ-కామర్స్ కన్జ్యూమర్లపై  ఏ మేరకు ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జూలై 1 నుంచి అమలయ్యే జీఎస్టీతో ఈ-కామర్స్ వినియోగదారులు ప్రభావితం కారని విశ్లేషకులు చెబుతున్నారు..  జీఎస్టీ ప్రత్యక్షంగా వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదని, ఈ పన్ను విధానం మరింత పారదర్శకతను తీసుకొస్తుందని అంటున్నారు..ఈ కొత్త పన్ను విధానంలో భాగంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు విక్రయదారులకు చెల్లించే మొత్తంలో ఒకశాతాన్ని మినహాయించుకుని వాటిని పన్ను రూపంలో ప్రభుత్వానికి సమర్పించాల్సి  ఉంటుంది. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఈ-కామర్స్ కంపెనీలు విక్రయదారులకు చెల్లింపులు చేసేటప్పుడు ఒకశాతం మూలం వద్ద పన్ను(టీసీఎ‍స్) తీసివేయాల్సి ఉంటుందని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా కూడా నిన్నటి జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం వెల్లడించారు..
 
జీఎస్టీ అమలు ఈ-కామర్స్  పరిశ్రమకు ఎంతో మంచిదని, సరుకు రవాణా జరిగేటప్పుడు కొన్ని రాష్ట్రాలు వేసే ప్రవేశ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అంతరాష్ట్రల మధ్య డెలివరీ చేపట్టేప్పుడు నెలకొనే సమస్యలు తగ్గుతాయన్నారు. ఫ్లిప్ కార్ట్ తో భారీగా పోటీ పడుతున్న ఈ అమెరికా సంస్థ, జీఎస్టీ నిబంధనలను నిశితంగా పరిశీలిస్తోంది. అయితే జీఎస్టీ నిబంధనలతో అమల్లోకి వచ్చే మూలం వద్దపన్నుపై దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు మాత్రం ఇంకా  స్పందించలేదు. ఈ నిబంధన వల్ల ఏటా దాదాపు రూ. 400 కోట్ల పెట్టుబడులు లాక్‌ అయిపోతాయని, వ్యాపారులు ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ముందుకు రాబోరని ఇన్నిరోజులు ఈ-కామర్స్ సంస్థలు వాపోయాయి.      
మరిన్ని వార్తలు