Chandubhai Virani Success Story: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!!

23 Nov, 2023 11:19 IST|Sakshi

ఓ వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందంటే.. దాని వెనుక అంత పెద్ద సాహసం చేసి ఉంటాడని అర్థం. జీవితంలో ఎన్నెన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని నిలబడగలిగితే విజయం వాడి సొంతమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'చందూభాయ్ విరానీ' (Chandubhai Virani). క్యాంటిన్‌లో పనిచేసే స్థాయి నుంచి వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు? దాని వెనుక అతని కృషి ఎలా ఉందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రైతు కుటుంబంలో జన్మించిన 'చందూభాయ్' కేవలం 10వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. ఆ తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో తన సోదరులతో కలిసి తండ్రి వద్ద రూ. 20000 తీసుకుని ఉన్న ఊరు వదిలి రాజ్‌కోట్‌కు వెళ్లారు. అక్కడ వ్యవసాయ సామాగ్రిని విక్రయించే వ్యాపారం మొదలుపెట్టి, సక్సెస్ కాలేకపోయారు. వ్యాపారం దివాళాతీసింది. దీంతో ఆ వ్యాపారం వదిలేయాల్సి వచ్చింది.

క్యాంటీన్‌లో ఉద్యోగం..
వ్యాపారంలో నష్టపోయామని దిగులు చెందక ఇంకా ఏదో చేయాలనే తపనతో ఒక సినిమా క్యాంటీన్‌లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ అతని జీతం రూ. 90 మాత్రమే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఎదగాలన్న ఆశను మాత్రం కోల్పోలేదు. దీంతో క్యాంటీన్‌లో ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవాడు.

ఆ సమయంలో చందూభాయ్, అతని కుటుంబ సభ్యులు తమ అవసరాలను తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవారు. తాను ఉంటున్న రూమ్ రెంట్ రూ.50 చెల్లించలేక గది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది అతని జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది.

బాలాజీ వేఫర్స్‌..
క్యాంటీన్‌లో పనిచేసుకుంటున్న సమయంలో చందూభాయ్, అతని సోదరులకు నెలకు రూ. 1000 విలువ చేసే కాంట్రాక్ట్ ఒకటి లభించింది. దీంతో వారు ఒక చిన్న షెడ్ నిర్మించి, అక్కడ నుంచే చిప్స్ తయారు చేయడం ప్రారంభించి 'బాలాజీ వేఫర్స్‌' అనే పేరుతో విక్రయించడం స్టార్ట్ చేశారు.

సినిమా థియేటర్‌, చుట్టుపక్కల వేఫర్‌లను విక్రయించడం ప్రారంభించారు. ప్రారంభంలో అనుకున్నంత ఆదరణ పొందలేకపోయినా.. క్రమంగా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఈ బాలాజీ వేఫర్స్‌ విస్తరణ ప్రారంభమైంది. 1995లో ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది.

ఇదీ చదవండి: యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!

ఓ చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపారం గుజరాత్ , రాజస్థాన్ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌లలో అతి పెద్ద స్నాక్స్‌ మ్యానుఫ్యాక్చరర్‌గా అవతరించి భారతదేశంలో అతిపెద్ద వేఫర్ బ్రాండ్‌గా నిలిచింది. 2021 ఆర్ధిక సంవత్సరం కంపెనీ విలువ ఏకంగా రూ. 4000 కోట్లు అని సమాచారం.

మరిన్ని వార్తలు