ఆర్థిక మంత్రి ప్రకటనతో భారీ రిలీఫ్‌..

23 Aug, 2019 18:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు అదనంగా సమకూర్చిన రూ 70,000 కోట్ల నిధులను మంజూరు చేశామని దీంతో రుణ వితరణ భారీగా పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్‌బీఐ రెపో రేట్లు తగ్గించడంతో ఆయా ప్రయోజనాలను రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఖాతాదారులకు చేరవేసేందుకు బ్యాంకులు అంగీకరించాయని తెలిపారు. దీంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గి ఈఐఎంల భారం దిగివచ్చే అవకాశం ఉంది. ఇక ఖాతాదారులు రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 15 రోజుల్లోగా లోన్‌ డాక్యుమెంట్లను తిరిగి కస్టమర్లకు చేర్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమయ్యాయని వెల్లడించారు. వృద్ధికి ఊతం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె భరోసా ఇచ్చారు.

స్టాక్‌ మార్కెట్లలో దీర్ఘకాలిక, స్వల్పకాల క్యాపిటల్‌ గెయిన్స్‌పై పెంచిన సర్‌చార్జ్‌ను తొలగించినట్టు మంత్రి వెల్లడించారు. ఎఫ్‌పీఐలు, సూపర్‌ రిచ్‌పై అదనంగా విధించిన సర్‌చార్జ్‌ను తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసే మదుపరులకు వెసులుబాటు కల్పించినట్టయింది. ఇక జీఎస్టీలో సంక్లిష్టతలను సవరించి పన్ను వ్యవస్థను మరిత సరళతరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక మందగమనం నివారించేందుకు పలు చర్యలు చేపడతామని చెప్పారు. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలు, స్వాధీన ప్రక్రియలకు అనుమతులను సరళతరం చేస్తామని చెప్పారు.. ఐటీ ఆదేశాలు, సమన్లు, లేఖలు అక్టోబర్‌ 1 నుంచి కేంద్రీకృత వ్యవస్థ ద్వారా వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఆదాయ పన్నుకు సంబంధించిన అన్ని అసెస్‌మెంట్లు మూడు నెలల్లో పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. . డీపీటీఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఐటీ యాక్ట్‌56 2(బీ) వర్తించదని చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా