భారత్ లో ఆర్థిక అసమానతలు అధికం

5 May, 2016 01:51 IST|Sakshi
భారత్ లో ఆర్థిక అసమానతలు అధికం

ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి
ఆసియా పసిఫిక్‌లో భారత్, చైనాల్లోనే అత్యంత దుర్భరమని విశ్లేషణ

 సింగపూర్: భారత్, చైనాల్లో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో-  ఈ రెండుదేశాల్లోనే ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలయినప్పటికీ ఈ దేశాల్లో ఆర్థిక సమతౌల్యతలు తగిన విధంగా లేవని పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు..

భారత్, చైనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పేదరికమూ తగ్గుతోంది. అయితే ధనిక, పేద మధ్య వ్యత్యాసం తీవ్రంగా ఉంది.

గతంలో ఆసియాలో వృద్ధి పంపిణి తగిన స్థాయిలో ఉండేది. అయితే భారత్, చైనాలు ఇటీవల పేదరికం తగ్గుతున్నా.... సమానత్వ సాధన ద్వారా వృద్ధి చెందడంలో వెనకబడుతున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో మధ్య తరగతి ఆదాయాల పెరుగుదలలో చైనా, థాయ్‌లాండ్‌లు కొంత విజయం సాధించగలిగాయి. అయితే భారత్, ఇండోనేసియాలు అధిక ఆదాయ స్థాయిలవైపు ఈ వర్గాన్ని తీసుకువెళ్లడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

భారత్, చైనాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆదాయాల్లో సైతం వ్యత్యాసం తీవ్రంగా పెరిగింది. చైనాలో వేగవంతమైన పారిశ్రామికీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోస్తా ప్రాంతాలపై దృష్టి  పెట్టడం వంటి అంశాలు మారుమూల ప్రాంతాల వృద్ధికి విఘాతంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు కూడా పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వ్యత్యాసానికి కారణం.

పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు కూడా బలహీనంగా ఉన్నాయి.

కాగా ఆదాయ వ్యత్యాసాలను తొలగించడానికి, ఆర్థిక పారదర్శకతను నెలకొల్పడానికి రెండు దేశాలు తగిన ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఇవి రానున్న కాలంలో కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. భారత్‌లో అందరినీ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రారంభించిన జన్‌ధన్ యోజన ప్రశంసనీయమైనది. దీనితోపాటు, ఆధార్, మొబైల్ ఆధారిత సేవలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద కార్యకలాపాలు ఆర్థిక స్వావలంభన దిశలో ముఖ్యమైనవి.

భారత్ వృద్ధి 7.4 శాతం: హెచ్‌ఎస్‌బీసీ
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది(2016-17) 7.4% వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- హెచ్‌ఎస్‌బీసీ తన పరిశోధనా నివేదికలో అంచనావేసింది. వచ్చే ఆరు త్రైమాసికాల్లో తయారీ రంగం పేలవంగా ఉండే అవకాశం ఉందనీ, అయితే అదే సమయంలో తగిన వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందని వివరించింది.  మొత్తం జీడీపీలో ఈ రంగాల వాటా వరుసగా 17, 15 శాతాలుగా ఉండే వీలుందని నివేదిక పేర్కొంది.

ఇక బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య కొనసాగుతుందని పేర్కొంది. తగిన వర్షపాతం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6%గా నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనావేసింది. ఆర్థికశాఖకు సంబంధించి ఈ అంచనాలు  7-7.75%గా ఉన్నాయి. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంచనాలు కూడా హెచ్‌ఎస్‌బీసీ అంచనాల స్థాయిలోనే 7.4%గా ఉన్నాయి.

 వృద్ధికి సంస్కరణలు కీలకం: కొటక్: కాగా భారత్ సత్వర వృద్ధికి సంస్కరణలు కీలకమని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. చైనాలో మందగమన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని భారత్ దిశగా మళ్లించడానికి భారత్‌లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా వస్తు సేవల పన్ను, దివాలా కోడ్ అమలు, కార్మిక చట్ట సంస్కరణల అవసరాన్ని ఉద్ఘాటించింది. విద్యా, ఉపాధి రంగాల్లో మెరుగుదల, సామాన్యునికి సత్వర న్యాయం దిశలో చర్యలు అవసరమని సూచించింది.

మరిన్ని వార్తలు