ఐటీ వ్యయాల వృద్ధి తగ్గుతుంది

14 Jul, 2017 00:24 IST|Sakshi
ఐటీ వ్యయాల వృద్ధి తగ్గుతుంది

2.4 శాతానికే పరిమితం...
రీసెర్చ్‌ సంస్థ గార్ట్‌నర్‌ వెల్లడి


ముంబై: డిజిటైజేషన్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో 2017లో ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ఐటీ రీసెర్చ్‌ సంస్థ గార్ట్‌నర్‌ మరింతగా కుదించింది. దీన్ని 2.7 శాతం నుంచి 2.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. వృద్ధి 3 శాతం మేర ఉండొచ్చని గార్ట్‌నర్‌ ముందుగా  అంచనా వేసినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో దాన్ని 2.7 శాతానికి కుదించింది. ఐటీ పరిశ్రమ భవిష్యత్‌పై ఆందోళన నెలకొన్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఆటోమేషన్‌ ఇటు వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు.. దేశీయంగా ఐటీ ఉద్యోగాల్లో కోతకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ఈ ఏడాది పరిశ్రమ వృద్ధి రేటు 7–8%కి మాత్రమే పరిమితం కావొచ్చని అంచనా వేసింది.

వెల్లువలా కొంగొత్త టెక్నాలజీలు..
డిజిటల్‌ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోందని గార్ట్‌నర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ డేవిడ్‌ లవ్‌లాక్‌ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు సర్వీసులు, అలాగే మేధోహక్కుల సేవలు కూడా కలిపి అందించే కొత్త తరహా వ్యాపార విధానాలకు తెరతీస్తోందన్నారు. ఈ సంవత్సరం ఐటీ వ్యయాల వృద్ధి అంచనాలను కుదించినప్పటికీ 2016లో నమోదైన 0.3% కన్నా అధికంగానే ఉండనుందని, పరిశ్రమను 3.477 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చగలదని వివరించారు.

మరిన్ని వార్తలు